ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌కు డెడ్‌లైన్
వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రారంభిస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్ | Ntoday News
ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి, వాహనాల రాకపోకలకు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.
శాసనమండలిలో సభ్యులు సిరికొండ మధుసూదనాచారి, తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2017లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు NCLT వివాదాలు, కాంట్రాక్టర్ల వైఫల్యం తదితర కారణాలతో పనులు నిలిచిపోయాయని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా జోక్యం చేసుకోవడంతో ప్రాజెక్టు పనులను వేగవంతం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఎలివేటెడ్ కారిడార్ కింద ఉన్న BT రోడ్ల మరమ్మతు పనులు ఇప్పటికే పూర్తయ్యాయని మంత్రి వివరించారు. కారిడార్ అందుబాటులోకి వస్తే ఉప్పల్–నారపల్లి మార్గంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి పలు ప్రాజెక్టులను చేపడుతోంది. ఇటీవల ప్రభుత్వం 34 ప్యాకేజీల్లో 6,092 కిలోమీటర్ల మేర 441 రహదారుల విస్తరణకు రూ.13,060 కోట్ల అంచనా వ్యయంతో కార్యక్రమాన్ని ప్రారంభించింది.