ఉరుమడ్లలో పలు కార్యక్రమాల్లో డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి
ఉరుమడ్లలో పలు కార్యక్రమాల్లో డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ముత్యాలమ్మ, మారెమ్మ, పాపమ్మ ఆలయాల నిర్మాణంలో భాగంగా నిర్వహించిన ధ్వజ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయన కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ఊర చెరువు వద్ద ముత్యాలమ్మ నూతన ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
అనంతరం ఉరుమడ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన గుత్తా అమిత్ రెడ్డి.. 8, 9, 10వ తరగతుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలతో పాటు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్, మాజీ ఎంపీటీసీ పోలగొని స్వామి, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.