నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందడుగు
మంచిర్యాల: పోలీస్ కానిస్టేబుల్, సబ్‌ఇన్‌స్పెక్టర్ (SI), ఫారెస్ట్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించే కార్యక్రమాన్ని మంచిర్యాల కాలేజీ రోడ్డులోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో ప్రారంభించారు.
కీ.శే. కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతిభ ఉన్న యువత ఉద్యోగ అవకాశాలను కోల్పోకూడనే ఉద్దేశంతో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు అవసరమైన నాణ్యమైన శిక్షణ, సరైన మార్గదర్శకత్వం, క్రమశిక్షణతో కూడిన అభ్యాసం అందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన ప్రణాళికను రూపొందించుకుని, నిరంతర సాధనతో ముందుకు సాగాలని అన్నారు.
ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతిభ కలిగిన ప్రతి యువకుడు, యువతి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. శిక్షణలో పాల్గొనే అభ్యర్థులు పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్, సభ్యులు, సింగరేణి సంస్థ అధికారులు, డీసీపీ భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.