2002 సేల్ అగ్రిమెంట్ ప్రకారం కల్యాణ మండపం నిర్మించాలి
2002 సేల్ అగ్రిమెంట్ ప్రకారం కల్యాణ మండపం నిర్మించాలి
ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
చిట్యాల: చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణం కోసం 2002లో చేసుకున్న సేల్ అగ్రిమెంట్ ప్రకారం 1.12 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసి, అక్కడ వెంటనే కల్యాణ మండపాన్ని నిర్మించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కల్యాణ మండపం కోసం గతంలో కొనుగోలు చేసిన ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాల కోసం విరాళాలు, ప్రజల సహకారంతో కొనుగోలు చేసిన భూమిని గత 26 ఏళ్లుగా యథావిధిగా ఉంచారని తెలిపారు. అయితే నూతనంగా ఏర్పడిన మున్సిపల్ పాలకవర్గం ఈ భూమిని ఇతర అవసరాలకు వినియోగించేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు. ప్రజా అవసరాల కోసం ఉద్దేశించిన భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మున్సిపల్ పాలకవర్గంపై ఉందన్నారు. గతంలోనే రెవెన్యూ అధికారులు తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రతిపాదిత భూమిని సర్వే చేసి, టీటీడీ అధికారులకు భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు సంబంధిత నివేదికను సమర్పించారని చిరుమర్తి లింగయ్య తెలిపారు. అధికారిక ప్రక్రియ ముందుకు సాగాల్సి ఉండగా, ప్రస్తుతం ఈ భూమిని ఇతర అవసరాలకు వినియోగించే ప్రయత్నాలు చేయడం తగదన్నారు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వెంటనే స్పందించి, చిట్యాల మున్సిపల్ ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా ఈ భూమిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రతిపాదిత స్థలంలో వెంటనే ‘కల్యాణ మండపం కోసం కేటాయించిన స్థలం అని పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల డబ్బులు, విరాళాలతో కొనుగోలు చేసిన భూమి అన్యాక్రాంతానికి గురికాకుండా రక్షించడంతో పాటు, 2002లో చేసుకున్న సేల్ అగ్రిమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి, కల్యాణ మండపం నిర్మాణాన్ని ప్రారంభించాలని కోరారు. చిట్యాల పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతిపాదిత భూమిని వెంటనే కల్యాణ మండపం నిర్మాణానికి వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను చిరుమర్తి లింగయ్య కోరారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, చిట్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జమాన్ల శ్రీనివాస్ రెడ్డి, బొబ్బల శివశంకర్ రెడ్డి, జిట్ట బొందయ్య, 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ ఎస్‌కే షబానా అజీముద్దీన్, సింగిల్ విండో డైరెక్టర్ కన్నెబోయిన శ్రీశైలం, ఆగు అశోక్ యాదవ్, రుద్రవరం యాదయ్య, నాలావతి కృష్ణ, ఆవుల ఆనంద్ యాదవ్, బులుగురు సైదులు, జిట్ట శేఖర్, సారెడ్డి ప్రతాపరెడ్డి, బాలకృష్ణ, కూనూరు శంకర్, రుద్రారపు కృష్ణయ్య, ఎస్‌కే మనాన్, తోటకూరి అనిల్, నల్ల శివారెడ్డి, ఎండీ గౌస్, పాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.