అబుదాబీలో సంచలనం.. మేనకోడలికి రూ.3.85 కోట్ల తెల్లడేగ బహుమతి!
అబుదాబీ: మేనకోడలిపై ఉన్న అభిమానంతో ఓ అరబ్ వ్యక్తి ఏకంగా రూ.3.85 కోట్లు విలువ చేసే అరుదైన తెల్లడేగను బహుమతిగా అందించిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అబుదాబీలో జరిగిన అంతర్జాతీయ వేట, గుర్రపు స్వారీ ప్రదర్శనలో ఈ ఖరీదైన డేగను వేలం వేశారు.
అబుదాబీలో ఇటీవల నిర్వహించిన **‘అబుదాబీ ఇంటర్‌నేషనల్ హంటింగ్ అండ్ ఈక్వెస్ట్రియన్ ఎగ్జిబిషన్–2026’**లో అమెరికాకు చెందిన ‘మార్క్ మోగ్లిచ్ ఫాల్కన్ ఫామ్’ అరుదైన తెల్లడేగను వేలానికి ఉంచింది. **‘ప్యూర్ వైట్ గైర్ గర్మోషా’**గా పేర్కొన్న ఈ డేగను దక్కించుకునేందుకు పలువురు సంపన్నులు పోటీ పడ్డారు.
సుమారు 1.5 కిలోల బరువు, 16.5 అంగుళాల పొడవు ఉన్న ఈ తెల్లడేగకు వేలంలో భారీ ధర పలికింది. షైకా అల్ మన్సూరీ అనే యువతి తన మేనమామతో కలిసి వేలంలో పాల్గొని, స్వయంగా వేలం పాటలో బిడ్ చేస్తూ చివరకు 1.5 మిలియన్ దిర్హామ్‌లకు డేగను సొంతం చేసుకున్నట్లు సమాచారం. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.3.85 కోట్లు.
డేగలపై తనకు ఆసక్తి ఎలా ఏర్పడిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తన మేనమామ వల్లే డేగలపై మక్కువ పెరిగిందని మన్సూరీ వెల్లడించినట్లు సమాచారం.
వేలం పాటలో మన్సూరీ పాల్గొన్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఒక డేగకు ఇంత భారీ ధరా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.