నరసింహారావుపాలెం, బూరుగుగూడెం, చనుబండలో పత్తి పైర్లను పరిశీలన చేసిన ఏవో బి శివశంకర్
చాట్రాయి: పత్తి పంటలో చీడపీడల నివారణపై రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని నరసింహారావుపాలెం, బూరుగుగూడెం, చనుబండ గ్రామాల్లో పత్తి పైర్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ మూడు గ్రామాల్లో సుమారు 300 ఎకరాల్లో పత్తి పంట సాగు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి పంటకు నీటి ఎద్దడి లేకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమన్నారు.
పత్తి పంటలో 45–50 రోజుల పూత దశ, 70–80 రోజుల కాయలు ఊరే దశలో నీటి అవసరం కీలకంగా ఉంటుందని తెలిపారు. నేల స్వభావాన్ని బట్టి ప్రతి 15–20 రోజులకు ఒకసారి తేలికపాటి తడులు ఇవ్వాలని సూచించారు. బిందు సేద్యం ద్వారా నీటిని ఆదా చేయడంతో పాటు కలుపు సమస్యను కూడా తగ్గించుకోవచ్చన్నారు.
ఆకు మచ్చ, వేరు కుళ్లు తెగుళ్లు కనిపించినప్పుడు ఒక లీటర్ నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బెండజిమ్ 1–3 గ్రాములు లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు కలిపి మొక్క పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలని సూచించారు.
రసం పీల్చే పురుగుల ఉధృతి కనిపిస్తే తయోమిథాక్సామ్ 60 గ్రాములను ఎకరానికి 150 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని, ప్రత్యామ్నాయంగా ఇమిడాక్లోప్రిడ్ 50 మిల్లీలీటర్లను 150 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి పంటపై 13:0:45 లేదా 19:19:19 ఎరువును ఎకరానికి ఒక కిలో చొప్పున పిచికారీ చేస్తే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందని వ్యవసాయ అధికారి శివశంకర్ రైతులకు సూచించారు.