ఒంటరిగా నది శుభ్రం చేసిన యువకుడికి అదిరిపోయే జాబ్ ఆఫర్!
మధ్యప్రదేశ్: ఒంటరిగా నది శుభ్రం చేసిన యువకుడి కృషికి అంతర్జాతీయ గుర్తింపు
మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల బిట్టూ తబాహి పర్యావరణ పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన అజ్నార్ నదిని స్వచ్ఛంగా మార్చేందుకు ఆయన ఒంటరిగా శ్రమించడం ప్రారంభించారు.
నది పరిస్థితిని చూసి చలించిపోయిన బిట్టూ ఎవరూ ముందుకు రాకపోయినా వెనక్కి తగ్గకుండా స్వయంగా శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన కృషి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పలువురు స్నేహితులు కూడా ముందుకొచ్చి చేతులు కలిపారు. దీంతో కొన్ని నెలల పాటు కొనసాగిన శ్రమతో నదిని శుభ్రం చేయగలిగారు.
బిట్టూ అంకితభావానికి నెదర్లాండ్స్‌కు చెందిన ‘ది ఓషన్ క్లీనప్’ సంస్థ సీఈఓ బోయన్ స్లాట్ ముగ్ధుడయ్యారు. ఆయన బిట్టూతో కలిసి పనిచేయాలంటూ ఆన్‌లైన్ ద్వారా ఉద్యోగ అవకాశాన్ని ప్రకటించినట్లు సమాచారం.
ఒక చిన్న ప్రయత్నంగా మొదలైన బిట్టూ సేవా కార్యక్రమం అంతర్జాతీయ సంస్థ దృష్టిని ఆకర్షించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పర్యావరణాన్ని కాపాడేందుకు ఒక్క వ్యక్తి కూడా మార్పుకు నాంది పలకగలడని బిట్టూ నిరూపించారు.