భావ్‌నగర్‌లో దారుణం.. ప్రియురాలిని చంపిన చోటే నిందితుడికి పోలీసుల దేహశుద్ధి
గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. గత ఏడెనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్న 40 ఏళ్ల కాజల్ బెన్ బరయ్యాను ఆమె ప్రియుడు ఫైసల్ అలియాస్ ఖత్కీ లఖానీ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
భావ్‌నగర్ ఎస్టీ బస్టాండ్ పరిసరాల్లోనే ఎక్కువగా నివసించే ఫైసల్, కాజల్‌కు రవి గోహిల్ అనే వ్యక్తితో సంబంధం ఉందని అనుమానించాడు. సెప్టెంబర్ 3న మధ్యాహ్నం బస్టాండ్‌లో ఈ ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఫైసల్ కాజల్‌పై దాడికి పాల్పడ్డాడు.
కాజల్‌ను కిందపడేసి విచక్షణారహితంగా తన్నడంతో పాటు పిడిగుద్దులతో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె తలను నేలకేసి కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సెప్టెంబర్ 4న కాజల్ మృతి చెందింది.
మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఫైసల్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిపై గతంలోనూ దోపిడీ, దాడి వంటి కేసులు ఉన్నాయని, ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ పేరుతో..
సెప్టెంబర్ 5న నీలమ్‌బాగ్ పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఫైసల్‌ను అదే బస్టాండ్‌కు తీసుకెళ్లారు. అక్కడ నిందితుడిపై పోలీసులు లాఠీలతో దాడి చేశారు. ప్రజలు చూస్తుండగానే అతడిని చితకబాదిన ఘటన అక్కడ కలకలం రేపింది.
మహిళలపై నేరాలకు పాల్పడే వారిలో భయం కలిగించడంతో పాటు ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనే సందేశం ఇచ్చేందుకే ఈ చర్య చేపట్టినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ డి.పి. ఉనద్కడ్ తెలిపారు.