ఏపీ నుంచి దేశవ్యాప్తంగా వీబీ జీ రామ్ జీ పథకం ప్రారంభం
రైల్వేకోడూరు వేదికగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా చారిత్రాత్మక ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవికా మిషన్ (వీబీ జీ రామ్ జీ) పథకం ఆంధ్రప్రదేశ్ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ముక్కవారిపల్లి గ్రామం ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వేదికగా నిలిచింది. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి , ముఖ్యమంత్రి , డిప్యూటీ సీఎం కలిసి పథకాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా రూ.4.55 లక్షల వ్యయంతో చేపట్టనున్న మూడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రెయిన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను వీబీ జీ రామ్ జీ మిషన్ కింద ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు జాబ్ కార్డులను పంపిణీ చేశారు.
వీబీ జీ రామ్ జీ ప్రోత్సాహక గీతాన్ని కేంద్ర మంత్రులు , ఆవిష్కరించారు. పథకానికి సంబంధించిన సమాచార బుక్‌లెట్, కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విడుదల చేయగా, వీబీ జీ రామ్ జీ పోర్టల్‌ను నేతలు ప్రారంభించారు.
రూ.11 వేల కోట్లతో గ్రామాల రూపురేఖలు మారతాయి : సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రైల్వేకోడూరు నుంచి దేశవ్యాప్తంగా వీబీ జీ రామ్ జీ ప్రారంభం కావడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. గతంలో నరేగా కూడా రాయలసీమ నుంచే ప్రారంభమైందని, ఇప్పుడు మరో కీలక పథకం కూడా ఇదే ప్రాంతం నుంచి అమల్లోకి రావడం ప్రత్యేకత అని అన్నారు.
వీబీ జీ రామ్ జీ కింద కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 వేల కోట్లతో మొత్తం రూ.11 వేల కోట్లకు పైగా వ్యయంతో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారథ్యంలో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని చెప్పారు.
125 రోజుల పని దినాలతో గ్రామీణాభివృద్ధికి అవసరమైన ప్రతి పనిని చేపట్టే అవకాశం ఈ పథకంలో ఉందన్నారు. గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలు, కాలువలు, నీటి సంరక్షణ పనులు, పశుసంవర్థక మౌలిక సదుపాయాలు, వ్యవసాయ అనుబంధ పనులు చేపట్టేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ విధానాలతో పూర్తి పారదర్శకతతో పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. గాలేరు-నగరి నుంచి కోడూరుకు నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపడతామని, జలధార కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంచుతామని వెల్లడించారు.
గ్రామసభలతో గిన్నిస్ రికార్డు
రాష్ట్రంలోని 13,226 గ్రామాల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించామని సీఎం తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటికే 7 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 40 వేల గోకులాలు, 15,500 నీటి తొట్టెలు, 1.07 లక్షల ఫార్మ్ పాండ్లు, 1,373 కిలోమీటర్ల గిరిజన ప్రాంత రహదారులు, 1.66 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చేసినట్లు వివరించారు.
55.44 కోట్ల పని దినాలు కల్పించి రూ.16,695 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది 10 వేల కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల సిమెంట్, బీటీ రోడ్లు, 500 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు, లక్ష ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
వ్యవసాయ భూములకు వెళ్లే డొంక రహదారులను కూడా వీబీ జీ రామ్ జీ కింద నిర్మించవచ్చని వెల్లడించారు.
రెండేళ్లలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం
జల్ జీవన్ మిషన్‌తో సహా 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, వాటిని తిరిగి పునరుద్ధరించామని సీఎం పేర్కొన్నారు. రూ.28 వేల కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందని, వేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టడంతో పాటు రైల్వే జోన్ సాధించామని, గూగుల్ డేటా సెంటర్, పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ యూనిట్ ఏర్పాటు కానున్నాయని తెలిపారు.
రాయలసీమను దేశంలోనే ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని, త్వరలో రూ.40 వేల కోట్ల ప్రభుత్వ పెట్టుబడులు, రూ.60 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని వెల్లడించారు. మదనపల్లిలో హార్టికల్చర్ హబ్‌కు త్వరలో శంకుస్థాపన చేస్తామని, సత్యవేడులో హీరో మోటార్స్ యూనిట్, తిరుపతిలో బుల్లెట్ మోటార్ సైకిళ్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు కానున్నాయని వివరించారు.
స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, బంగారం గనులు ఉన్న జొన్నగిరి పేరును చారిత్రకంగా స్వర్ణగిరిగా మార్చినట్లు తెలిపారు. "భారతమాతకు వికసిత్ భారత్ – తెలుగు తల్లికి స్వర్ణాంధ్ర" అనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని, స్వర్ణాంధ్రప్రదేశ్ అన్‌స్టాపబుల్ అని స్పష్టం చేశారు.
"ఏపీకి నేను మేనమామ" : కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ దేశంలోని గ్రామాల అభివృద్ధి కోసం వీబీ జీ రామ్ జీ పథకం కింద రూ.7.5 లక్షల కోట్లు వ్యయం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన తొమ్మిది నెలల కాలానికి ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,700 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. గ్రామసభలే గ్రామ పంచాయితీల్లో చేపట్టాల్సిన పనులను నిర్ణయిస్తాయని తెలిపారు.
"మధ్యప్రదేశ్‌లో నన్ను మామాజీ అని పిలుస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు కూడా నేను మేనమామనే. ఏ మేనమామ ఖాళీ చేతులతో రాడు" అంటూ సభలో వ్యాఖ్యానించారు.
రూ.422 కోట్ల నిధులు – తోతాపురి మామిడికి కేంద్రం అండ
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రంలో 74,212 పక్కా ఇళ్ల నిర్మాణానికి, గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.422 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఆమోద పత్రాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అందజేశారు.
అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. దీంతో మామిడి రైతులకు భారీ ఊరట లభించనుంది.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక మొక్క నాటేలా సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.