అసెంబ్లీ వద్ద గాయపడ్డ మహిళా పోలీసులకు మంత్రి సీతక్క పరామర్శ
అసెంబ్లీ వద్ద గాయపడ్డ మహిళా పోలీసులకు మంత్రి సీతక్క పరామర్శ
హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద సోమవారం జరిగిన ఘటనలో గాయపడ్డ మహిళా పోలీసులను మంత్రి సీతక్క పరామర్శించారు. విధి నిర్వహణలో ఎదురైన ఇబ్బందులను మహిళా పోలీసు అధికారులు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను అసభ్యంగా తాకారని, అందుకు సంబంధించిన దృశ్యాలను మంత్రికి చూపించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
టీషర్టులు విసిరి మీదికి వచ్చారు
‘‘మేము మా విధులు నిర్వహిస్తుండగా టీషర్టులు విసిరి మాపైకి వచ్చారు. విధి నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. తాము అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామని బెదిరించారు’’ అని మహిళా పోలీసులు వివరించినట్లు సమాచారం.
తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు, ఫొటోలు బయటకు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇలాంటి విధులు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తోందని మంత్రికి వివరించారు.
ధైర్యంగా ఉండండి.. ప్రభుత్వం అండగా ఉంటుంది
మహిళా పోలీసులకు మంత్రి సీతక్క ధైర్యం చెప్పారు. ‘‘ధైర్యంగా ఉండండి. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ విధులు మీరు నిర్వహించండి. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు’’ అని భరోసా ఇచ్చారు.