స్పీకర్ కంటతడి చూసి సీఎం ఆవేదన....
స్పీకర్ కంటతడి చూసి సీఎం ఆవేదన.. ప్రసాద్‌కుమార్‌కు రేవంత్, భట్టి పరామర్శ
హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం పరామర్శించారు. అసెంబ్లీకి వచ్చిన వెంటనే స్పీకర్ ఛాంబర్‌లో ప్రసాద్‌కుమార్‌ను కలిసి సోమవారం అసెంబ్లీ ఎదుట చోటుచేసుకున్న పరిణామాలపై ఆరా తీశారు.
స్పీకర్‌పై వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను వ్యక్తిగతంగా దూషించడంతో స్పీకర్ కంటతడి పెట్టుకున్న దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా వచ్చిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ఆయనను ఓదార్చారు.
అసెంబ్లీ ఆవరణలో అధికారులపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా మహిళా అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని అసభ్య పదజాలంతో దూషించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానమని పేర్కొంది.
బాధ్యులపై తగిన చర్యలు
నిన్నటి ఘటనలకు బాధ్యులైన వారిపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి స్పీకర్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ గౌరవాన్ని, రాజ్యాంగ పదవుల ప్రతిష్ఠను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను పరామర్శించి జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు.