హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మృతిని కోరుతూ వ్యాఖ్యలు చేశారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 351, 351(3), 196(1), 61 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
అదేవిధంగా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రవీణ్ కుమార్ పోలీసులను కోరారు. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలను, అలాగే ‘చావు కోరుతూ వెయ్యి డప్పుల ర్యాలీ చేయిస్తున్నాం’ అంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ సాధన కోసం పోరాడిన కేసీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, మహిళా నాయకులు పాల్గొని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేశారు.