అయ్యో పాపం.. మృతదేహాలు దొరక్క బొమ్మలకు అంత్యక్రియలు
నేపాల్ విపత్తులో విషాదం.. వారం దాటినా ఆచూకీ లభించని కుటుంబ సభ్యులు
కాఠ్మాండు | Ntoday News
నేపాల్‌లో సంభవించిన విపత్తు పలువురు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. వారం రోజులు దాటినా మృతదేహాలు లభించకపోవడంతో, కొందరు బంధువులు గడ్డితో బొమ్మలను తయారు చేసి వాటికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న హృదయవిదారక ఘటనలు కనిపిస్తున్నాయి.
త్రిశూలి నది పరివాహక ప్రాంతంతో పాటు కాఠ్మాండూలోని పశుపతి ఆర్యఘాట్ వద్ద ఇలాంటి విషాద దృశ్యాలు కనిపిస్తున్నట్లు సమాచారం. వరదలు, కొండచరియలు తదితర కారణాలతో గల్లంతైన తమ కుటుంబ సభ్యుల మృతదేహాలు లభించకపోవడంతో.. వారి ఆత్మలకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో సంప్రదాయ పద్ధతిలో గడ్డితో బొమ్మలు తయారు చేసి అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని బంధువులు కన్నీటిపర్యంతమవుతూ చెబుతున్నారు.
తమ వారిని చివరిసారిగా చూసుకోలేకపోయినా, కనీసం ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపత్తు కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయి, మృతదేహాలు కూడా లభించని పరిస్థితి ఎంతటి విషాదకరమో ఈ ఘటనలు కళ్లకు కడుతున్నాయి.
ఈ హృదయవిదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. “ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు” అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.