చాట్రాయిలో ఘనంగా ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభోత్సవాలు
చాట్రాయి, 12 జూన్ 2026: మండల పరిధిలోని చాట్రాయి మెయిన్, గంటిపాడు ఎల్.టి, పోలవరం కే.పి, మరియు మర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం శుక్రవారం అత్యంత వైభవంగా పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకలకు మండల విద్యాశాఖాధికారి-1 (ఎం.ఇ.ఒ) మాసగిరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు.
విద్యాశాఖాధికారి 1 మాసగిరి శ్రీనివాస్ పాఠశాలల్లో నూతనంగా చేరిన ఒకటో తరగతి చిన్నారులకు సాదరంగా స్వాగతం పలికారు. విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ వారికి గులాబీ పువ్వులు, చాక్లెట్లు అందించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులందరికీ నూతన విద్యాసంవత్సర పాఠ్యపుస్తకాలను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ
"ప్రభుత్వ బడులలోనే అత్యంత నాణ్యమైన విద్యతో పాటు ఉన్నతమైన మానవీయ విలువలు లభిస్తాయి. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తక్కువగా కాకుండా, మన ప్రభుత్వం బడులను తీర్చిదిద్దిందని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఆధునిక వసతులు మన పాఠశాలల సొంతమని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ఈ ఉచిత నాణ్యమైన విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు
వీటితో పాటు పాఠశాలల తరగతి గదులలో శుభ్రత, సౌకర్యాలు, ఆటపాటలు వంటి కార్యక్రమాల నిర్వాహణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు పాల్గొని వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గ్రామ పెద్దలు మరిడి చిట్టిబాబు, యర్రా ప్రసాద్ రావు, బిలుగుది జయరాజు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యా కమిటీ (SMC) చైర్మన్లు, సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.