చింతలపూడి మండలానికి గర్వకారణం.. ఉత్తమ ఉపాధ్యాయునిగా ప్రభాకర్
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
66 మార్కులతో జిల్లా స్థాయిలో రెండో స్థానం.. మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక
చింతలపూడి: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు బోధనలో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను గుర్తించి ప్రోత్సహించే క్రమంలో చింతలపూడి మండలానికి చెందిన యు. ప్రభాకర్ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. సుప్రియన్‌పేటకు చెందిన ప్రభాకర్ ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన విద్యాశాఖ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసింది.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 33 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందించేందుకు ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. పాఠశాల సహాయకులు, మాధ్యమిక శ్రేణి ఉపాధ్యాయుల విభాగాల్లో అత్యధికంగా 70 మార్కులు సాధించిన వారు మొదటి స్థానంలో నిలిచారు. ఈ పోటీలో చింతలపూడి మండలానికి చెందిన యు. ప్రభాకర్ 66 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక కావడంతో ప్రభాకర్‌కు విద్యాశాఖ అధికారులు, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. బోధన పట్ల నిబద్ధత, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, పాఠశాల అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. చింతలపూడి మండలానికి చెందిన ఉపాధ్యాయుడు జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం మండలానికి గర్వకారణమని అభినందనలు తెలిపారు.