దేవరపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మహిళలకు భద్రత అవగాహన సదస్సు
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం, యర్నగూడెం గ్రామంలో మహిళల భద్రత, గంజాయి, సైబర్ నేరాలు, చోరీల నివారణపై మరియు రాబోవు వినాయక చవితి, పంచాయతీ ఎలక్షన్స్ పై అవగాహన కార్యక్రమం
దేవరపల్లి: యర్నగూడెం గ్రామంలో దేవరపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు మహిళల భద్రత, గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, చోరీల నియంత్రణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి సిఐ నాగేశ్వర నాయక్, ఎస్‌ఐ మనోహర్ గ్రామ ప్రజలకు పలు ముఖ్యమైన అంశాలపై దిశానిర్దేశం చేశారు.
మహిళలు మరియు బాలికల భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ, బాలికలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీనేజ్ వయస్సులో ఏర్పడే ప్రేమ వ్యవహారాల విషయంలో బాలబాలికలపై తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా దృష్టి పెట్టాలని, సోషల్ మీడియా పరిచయాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలు, యువతపై దాని ప్రభావం గురించి ప్రజలకు వివరించారు. గంజాయి వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులను అవసరమైన సందర్భాల్లో గంజాయి టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షించి, పాజిటివ్‌గా తేలిన వారికి తగిన కౌన్సిలింగ్ అందించి, అవసరమైతే డీ-అడిక్షన్ సెంటర్లకు పంపించి, గంజాయి వ్యసనం నుంచి బయటపడేలా సహకరిస్తామని తెలిపారు. గంజాయి విక్రయాలు, వినియోగంపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
రాత్రి వేళల్లో జరిగే దొంగతనాలు మరియు ఇతర నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల సంచారం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామంలోని ముఖ్యమైన ప్రదేశాలు, కూడళ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణతో పాటు నేరస్తులను గుర్తించడంలో పోలీసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.
అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, గుర్తుతెలియని వ్యక్తులకు OTPలు, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని సూచించారు. అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ మోసాలకు గురికాకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.
రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, వివాదాలు, ప్రలోభాలు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
రాబోయే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులు, లౌడ్‌స్పీకర్ల వినియోగం, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ భద్రత తదితర అంశాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసుల సూచనలు మరియు అనుమతులను పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.
అదేవిధంగా గ్రామాల్లో నిర్వహించే అనార్గనైజ్డ్ చిట్ ఫండ్‌లు, అనధికారిక చిట్ వ్యవహారాల వల్ల కలిగే ఆర్థిక నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. సరైన అనుమతులు, చట్టబద్ధత లేని ఆర్థిక పథకాల్లో డబ్బులు పెట్టి మోసపోవద్దని హెచ్చరించారు.
గ్రామ ప్రజలు పోలీసులతో సమన్వయంతో పనిచేస్తూ, నేరాల నివారణలో తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ఏ సమస్య ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ మనోహర్ కార్యదర్శి యు ముత్యాలు నాగ్ గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.