తాతకుంట్లలో పోలీసుల పల్లెనిద్ర
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
కార్యక్రమంలో రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ రామచంద్రరావు, సీఐ గురు ప్రకాష్, విస్సన్నపేట ఎస్సై ఎం. అర్జున్ రాజు పాల్గొన్నారు. గ్రామంలో పర్యటించిన పోలీసు అధికారులు స్థానికులతో మాట్లాడి గ్రామంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, భద్రతకు సంబంధించిన అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. పోలీసు అధికారులు గ్రామంలోనే బస చేసి ప్రజలకు అందుబాటులో ఉండటంతో గ్రామస్తులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో గ్రామస్తులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.