కరువు మండలాలుగా ప్రకటించాలి.. రైతులకు ఎకరాకు రూ.25 వేల సాయం
తిరువూరు: తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఏ.కొండూరు మండలాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షులు వెదురు గోపిరెడ్డి డిమాండ్ చేశారు. వర్షాభావంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరారు.
వర్షాలు సకాలంలో కురవక పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇప్పటికే రెండేళ్లుగా పంటలకు గిట్టుబాటు ధరలు లేక పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి ఉందని, ప్రస్తుత వర్షాభావం రైతులపై మరింత ఆర్థిక భారం మోపుతోందని పేర్కొన్నారు.
ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి, అర్హులైన రైతులందరికీ పరిహారం అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని గోపిరెడ్డి కోరారు. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.