www.ntodaynews.com
ప్రాణాలు తోడేస్తున్నా పట్టదేం?
తెలంగాణ
ప్రాణాలు తోడేస్తున్నా పట్టదేం?
-హరికృష్ణ నిబానుపూడి
యు. ఎస్. క్లైమేట్ ఎమర్జెన్సీ అడ్వైసర్
NTODAY NEWS: ప్రత్యేక కథనం
ప్లాస్టిక్‌ల వల్ల సంభవిస్తున్న అనారోగ్యాలూ మరణాలు ప్రపంచానికి ఏటా 1.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయని లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ఇటీవల హెచ్చరించింది. ప్లాస్టిక్‌లలో క్యాన్సర్లు, అల్జీమర్స్, ఇతర వ్యాధులను కలిగించగల హానికర రసాయనాలు ఉంటాయి. వాటి వల్ల హృద్రోగాలు, పక్షవాతాల బారిన పడి ఏటా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్లాస్టిక్ వ్యర్థాలపై పోరాటంలో ప్రపంచ దేశాల వైఫల్యం కలవరపరుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 69శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు కేవలం 20 దేశాల నుంచే వస్తున్నాయి. ఒక్క అమెరికాయే తలసరిన ఏటా 130 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను వెలువరిస్తోంది. భారత్ విషయంలో అవి 0.12 కిలోలు. ప్రపంచవ్యాప్తంగా అరవై శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను భూమిలో పూడ్చిపెడుతున్నారు. కొంత శాతం వ్యర్థాలను తగలబెట్టినా మిగిలినవి పర్యావరణంలో కలిసిపోతున్నాయి.
ఏటా ఎనభై లక్షల టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతోంది. 2040కల్లా అది అంతకు నాలుగు రెట్లకు పెరుగుతుందన్న విశ్లేషణలు భయపెడుతున్నాయి. సూక్ష్మ ప్లాస్టిక్‌లు ఆహారం, నీరు, గాలి ద్వారా మానవ శరీరంలోకి చేరుతున్నాయి. ప్లాస్టిక్ ఉత్పత్తి కర్బన ఉద్గారాలకు దారితీసి వాతావరణ మార్పులను కలిగిస్తోంది. 2030కల్లా బొగ్గు వల్ల కంటే ప్లాస్టిక్‌తోనే ఉద్గారాలు ఎక్కువగా వెలువడతాయన్న విశ్లేషణలు తక్షణం మేలుకోవాల్సిన ఆవశ్యకతను చాటుతున్నాయి.
ముడిపడని ఒప్పందం
ఈ ఏడాది ఆగస్టులో 184 దేశాలూ 400 అంతర్జాతీయ సంస్థలకు చెందిన 2,600 మంది ప్రతినిధులు జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో సమావేశమయ్యారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ వ్యర్థాల నిరోధక ఒప్పందం కోసం సమితి ఆధ్వర్యంలో జరిగిన అయిదో సమావేశం అది. ప్రపంచంలో ఏటా నలభై కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి.
2040కల్లా అవి నాలుగింతలు పెరగనున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి జెనీవా సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని అంతా ఆశించారు. కానీ, 11 రోజుల చర్చల తరవాతా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ప్లాస్టిక్కులు, పాదరసం వంటి హానికర రసాయనాలను నియంత్రించాలని జెనీవా సభలో స్విట్జర్లాండ్, మెక్సికోలు సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను వంద దేశాలు సమర్థించాయి.
కానీ, చమురు ఉత్పత్తి దేశాలు వ్యతిరేకించాయి. అత్యధిక ప్లాస్టిక్కులు పెట్రోలియం నుంచే తయారవుతాయి. జెనీవా సభలో శిలాజ ఇంధన ఉత్పత్తి దేశాలు, రసాయనాల కంపెనీలకు చెందిన 234 మంది ప్రతినిధులు ప్లాస్టిక్ నిషేధానికి వ్యతిరేకంగా పైరవీలు చేశారు. వీరి సంఖ్య 27 దేశాల ఐరోపా సమాఖ్య ప్రతినిధులను మించిపోయింది. ఇలాంటి శక్తుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతాయని ఐరాస మానవ హక్కుల సంస్థ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది.
పట్టు సడలింపులు, తూతూమంత్రం మార్పుచేర్పులతో బలహీన ఒప్పందం కుదుర్చుకోవడంకన్నా అసలు సంధి లేకపోవడమే మంచిదని పర్యావరణ బృందాలు వాదిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా సమస్య పరిష్కారం కాదని, ఈ దహన ప్రక్రియలో మరిన్ని హానికర రసాయనాలు వాతావరణంలో చేరిపోతాయని అవి హెచ్చరించాయి. దీనికన్నా ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించడం మేలన్నాయి.
అన్నింటినీ మించి ప్లాస్టిక్ ఉత్పత్తిపై పరిమితులు విధించి కచ్చితంగా అమలుచేయడం, నియంత్రణకు నిర్ణీత కాల పరిమితితో లక్ష్యాలను నిర్దేశించి వాటిని అందుకోవడం ఉత్తమమని సిఫార్సు చేశాయి. ధనిక దేశాలు తమ ప్లాస్టిక్ చెత్తను పేద దేశాలకు తరలించడాన్ని వ్యర్థాల వలసగా పర్యావరణ సంఘాలు అభివర్ణించాయి. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు పేద దేశాలకు అధునాతన టెక్నాలజీలను అందించాలని సిఫార్సు చేశాయి. ఇలాంటి జాగ్రత్తలతో ప్లాస్టిక్ వ్యర్థాలపై సర్వామోద ఒప్పందం కుదుర్చుకోవాలి.
భావితరాల మేలు కోసం...
ధనిక దేశాలు, చమురు ఉత్పత్తి దేశాలు కలిసిరాకపోతే ప్రగతిశీల, చిన్న ద్వీప దేశాలు విడిగా ఒప్పందం కుదుర్చుకుని ప్లాస్టిక్ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి. జెనీవా సభ విఫలమైనా, ప్రపంచ దేశాలు మళ్లీ ఈ అంశంపై సంప్రదింపులను పునరుద్ధరిస్తాయని ఆశిస్తున్నట్లు ఐరాస పర్యావరణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంగర్ యాండర్సన్ చెప్పారు. సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కూడా ఇదే ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని దేశాలు పారిస్ వాతావరణ సభ తీర్మానానికి కట్టుబడి శిలాజ ఇంధనాలను, ప్లాస్టిక్కులను కట్టడి చేయాలి. భావితరాల ప్రయోజనాలను కాపాడటానికి ఈ చర్యలు తప్పనిసరి అన్న అంతర్జాతీయ న్యాయస్థానం హితవును అందరూ ఆలకించాలి.
Follow us on
Website
Facebook
Instagram
YouTube