ఎనిమిదేళ్ల తర్వాత కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ
క్యూబెక్: కెనడాలోని క్యూబెక్‌లో ఎనిమిదేళ్లుగా జీవిస్తూ అక్కడే తమ జీవితాన్ని నిర్మించుకున్న ఓ భారతీయ కుటుంబం చివరకు స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. శరణార్థి హోదా కోసం చేసిన అభ్యర్థనతో పాటు మానవతా దృక్పథంతో కెనడాలో కొనసాగేందుకు చేసిన ప్రయత్నాలు తిరస్కరణకు గురికావడంతో హరీష్ కుమార్, ఆయన భార్య సోనిక, ఇద్దరు కుమారులు జపేష్, గౌరేష్ సెప్టెంబర్ 7న విమానంలో భారత్‌కు చేరుకున్నారు. కెనడాలోనే పెరిగిన 14 ఏళ్ల జపేష్ కుమార్ స్వదేశానికి వెళ్లే ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కెనడాలోనే పెరిగానని, అక్కడే తనకు స్నేహితులు ఉన్నారని, భారత్‌లో తనకు పరిచయాలు లేవని చెప్పాడు. అతని 12 ఏళ్ల సోదరుడు గౌరేష్ కూడా తన బాల్యంలో ఎక్కువ భాగాన్ని క్యూబెక్‌లోనే గడిపాడు. దీంతో ఇప్పుడు తమకు పెద్దగా పరిచయం లేని దేశంలో కొత్తగా జీవితాన్ని ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వలసదారుల హక్కుల కోసం పోరాడుతున్న ఇమ్మిగ్రెంట్ వర్కర్స్ సెంటర్ ఈ కుటుంబాన్ని బహిష్కరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో హరీష్ ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తూ అవసరమైన సరుకుల రవాణాలో సేవలు అందించారని ఆ సంస్థ పేర్కొంది. ఆ సమయంలో కెనడా ఆర్థిక వ్యవస్థకు అవసరమైన కార్మికులుగా గుర్తించిన వారినే, సంక్షోభం ముగిసిన తర్వాత దేశం నుంచి పంపించడం వలస కార్మికుల పట్ల వ్యవస్థ అనుసరిస్తున్న తీరును వెల్లడిస్తోందని విమర్శించింది. అయితే కెనడా ఇమ్మిగ్రేషన్ అధికారులు బహిష్కరణ నిర్ణయాలను చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాతే అమలు చేస్తామని తెలిపారు. కెనడా సరిహద్దు సేవల సంస్థ నిబంధనల ప్రకారం బహిష్కరణ ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన తర్వాత సంబంధిత వ్యక్తులను సాధ్యమైనంత త్వరగా దేశం నుంచి పంపించాల్సి ఉంటుంది. హరీష్ గతంలో పంజాబ్‌లోని గొరాయా పట్టణంలో చిన్న కిరాణా దుకాణం నిర్వహించేవారు. ఎన్నికల ప్రచారం కోసం కొందరు రాజకీయ శక్తులు తనను డబ్బులు డిమాండ్ చేశారని, తాను నిరాకరించడంతో రాజకీయ వర్గాలతో సంబంధాలున్న పోలీసులు తనను తప్పుడు ద్విచక్ర వాహన పార్కింగ్ వివాదంలో అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారని హరీష్ ఆరోపించారు. భారత్‌లో తనకు ప్రాణహాని ఉందనే భయంతో 2018 ఏప్రిల్‌లో కెనడాకు వచ్చి శరణార్థిగా ఆశ్రయం కోరినట్లు తెలిపారు. ఎనిమిదేళ్లపాటు సాగిన న్యాయపోరాటం అనంతరం శరణార్థి అభ్యర్థన, మానవతా ప్రాతిపదికన కెనడాలో కొనసాగేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కుటుంబం చివరకు భారత్‌కు తిరిగి వచ్చింది.