www.ntodaynews.com
మహిళల ఆరోగ్యంతోనే కుటుంబ అభివృద్ధి
తెలంగాణ
మహిళల ఆరోగ్యంతోనే కుటుంబ అభివృద్ధి
NTODAY NEWS: కరీంనగర్ ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షలు వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం, గ్రామం అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళలు తప్పనిసరిగా ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షలను వినియోగించుకోవాలని సూచించారు. బొమ్మకల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఆవరణలో మహిళాభివృద్ధి–శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యం మెరుగుపడితే కుటుంబ అభివృద్ధితో పాటు గ్రామాభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందని తెలిపారు.
ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వీటి ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స పొందవచ్చని చెప్పారు. క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా ముందస్తుగా గుర్తించి చికిత్స అందించిన సందర్భాలు ఉన్నాయని వివరించారు. సభ రోజున మహిళలు వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందవచ్చని సూచించారు.
మహిళల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు, మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసర ఖర్చులు చేయవద్దని సూచించారు. అవసరమైన వారికి వైద్య సిబ్బంది ఇంటివద్దకే మందులు అందించే సౌకర్యం ఉందని పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించడం ద్వారా చదువుతో పాటు పోషణపై దృష్టి సారించవచ్చని, లోపపోషణ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పిల్లల చదువు, ఆరోగ్యంపై శ్రద్ధ చూపే అంగన్వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
మున్సిపల్ కమిషనర్ వ్యాఖ్యలు
మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ, శుక్రవారం సభలు ప్రారంభించినప్పటి నుంచి మహిళల ఆరోగ్యంలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తోందని తెలిపారు. అనేక మంది రక్తహీనతను అధిగమించారని చెప్పారు. ప్రతి మహిళ స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వ పథకాలు, ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.
ఫిర్యాదుల పెట్టె పరిశీలన
బొమ్మకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఫిర్యాదుల పెట్టెను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా లేదా వేధింపులకు గురైనా నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మహిళా పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహణ ఉంటుందని, ఫిర్యాదుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
భవిత కేంద్రం పరిశీలన
బొమ్మకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని భవిత కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. దివ్యాంగ విద్యార్థుల వివరాలు తెలుసుకుని, సిలబస్ ప్రకారం బోధన ఉపకరణాలతో నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. దివ్యాంగుల మానసిక అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలని తెలిపారు.
మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం.
బొమ్మకల్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ జకినపల్లి హారికను జిల్లా కలెక్టర్ సన్మానించారు. అంగన్వాడీ కేంద్రం నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన హారికను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉద్యోగాలు, పోటీ పరీక్షల్లో రాణించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఇన్‌చార్జ్ డిడబ్ల్యుఓ సుగుణ, సిడిపిఓ సబిత, తహసీల్దార్ రాజేష్, వైద్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్ సనా, ఐఆర్పి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube