విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన
విజయవాడ నగరపాలక సంస్థ
కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన
వర్షపు నీటి సంరక్షణపై ప్రజలకు విస్తృత ప్రచారం
వర్షపు నీటి సంరక్షణ, కాలువల పరిరక్షణ, నగర పరిశుభ్రత లక్ష్యంగా విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సీహెచ్. సూర్య నాయక్ ఆధ్వర్యంలో కృష్ణలంకలోని అంబేద్కర్ పార్క్ వద్ద నుండి 'క్యాచ్ ది రైన్' ప్రచార కార్యక్రమంలో భాగంగా నగరంలోని బందర్ కాలువల్లో పడవ ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
పడవలో కాలువను పర్యవేక్షిస్తూ లౌడ్‌స్పీకర్ల ద్వారా కాలువల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దని, క్యాచ్ ది రైన్ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల ఏర్పాటు, భూగర్భ జలాల పరిరక్షణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పడవలో కాలువలను పర్యవేక్షిస్తూ, లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు, గృహ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలు, ఇతర చెత్తను వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాలువల్లో చెత్త వేయడం వల్ల వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి వరదలు, నీటి నిల్వ, ప్రజారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు.
అలాగే వర్షపు నీటిని వృథా చేయకుండా ప్రతి ఇల్లు, అపార్ట్‌మెంట్, వాణిజ్య సముదాయం, ప్రభుత్వ కార్యాలయంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షపు నీటిని భూగర్భ జలాల్లోకి ఇంకించడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించవచ్చని అవగాహన కల్పించారు.
ప్రజలు నగర పరిశుభ్రతను కాపాడడంలో భాగస్వాములు కావాలని, కాలువల్లో చెత్త వేయకుండా నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వ్యర్థాలను అందించాలని, వర్షపు నీటి సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.
విజయవాడ నగరపాలక సంస్థ వర్షాకాలంలో కాలువల పర్యవేక్షణతో పాటు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ, వర్షపు నీటి సంరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణపై నిరంతరం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి
విజయవాడ నగరపాలక సంస్థ