గుంటూరు: మైనర్ బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది
మూడు నెలలుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసులో పోలీసులు ఎట్టకేలకు ఆచూకీ గుర్తించారు. జూన్ 10న బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలికకు బాపట్ల జిల్లా ఉప్పుటూరు గ్రామానికి చెందిన జాన్ సైదాతో గత రెండేళ్లుగా పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం పెంచుకున్న నిందితుడు.. పలు పేర్లతో ఖాతాలు సృష్టించి పోలీసులకు చిక్కకుండా నాలుగు రాష్ట్రాల్లో సుమారు 50 రోజుల పాటు తిరిగినట్లు పోలీసులు తెలిపారు.
హర్యానాలోని కర్నాల్‌లో బాలిక, జాన్ సైదా ఉన్నట్లు ప్రత్యేక పోలీసు బృందాలు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నాయి. బాలిక ఇంటి నుంచి వెళ్లే సమయంలో 200 గ్రాముల బంగారం, రూ.లక్ష నగదు తీసుకెళ్లినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
బాలిక తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో పోలీసులు మరింత వేగంగా దర్యాప్తు చేపట్టారు. పోలీసు ఉన్నతాధికారి హైకోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు కూడా జారీ అయ్యాయి.
నిందితుడు జాన్ సైదాపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదని, చట్ట ప్రకారమే దర్యాప్తు నిర్వహించినట్లు స్పష్టం చేశారు.