తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 15 గంటలు
తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలో సందడి నెలకొంది. క్యూ లైన్లలో భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఆహారం తదితర సౌకర్యాలను అందిస్తున్నారు.
ఇక గురువారం శ్రీవారిని 68,265 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న 26,959 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి భక్తులు భారీగా కానుకలు సమర్పించగా, ఒక్కరోజులో రూ.4.16 కోట్ల ఆదాయం సమకూరింది.
భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శనానికి వచ్చే వారు తమ ప్రయాణ ప్రణాళికను అందుకు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.