కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు - యువత, రైతులు తిరగబడితే నాయకులు బయట తిరగలేరు
మంచిర్యాల: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, యువతను దారుణంగా మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంచిర్యాలలో జరిగిన 'యువసంగ్రామ సదస్సు'లో ఆయన మాట్లాడుతూ, 31 నెలల కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. యువత ఆకాంక్షలు నెరవేర్చకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో ఉవ్వెత్తున ఎగిసిపడి కాంగ్రెస్ నాయకులను తరిమికొడతారని హెచ్చరించారు.
రైతుల కష్టాలు - కాళేశ్వరంపై చిల్లర రాజకీయాలు:
రైతుబంధు ఇవ్వకుండా, ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించి కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరువు సృష్టించిందని మండిపడ్డారు. ఈ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలను ఆదుకోవాలని బీఆర్ఎస్ ధర్నా చేసినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. కరువుకి పరిష్కారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ ప్రభుత్వం కేవలం చిల్లర రాజకీయాలు చేస్తోందని, కుంగిన రెండు పిల్లర్లకు 36 నెలలైనా ఎందుకు మరమ్మతులు చేయడం లేదని నిలదీశారు.
పోలీసులు, అధికారులకు హెచ్చరిక:
మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రతి ఒక్కరి పేరు రాసి పెట్టుకుంటున్నామని కేటీఆర్ హెచ్చరించారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసం పని చేయాలని, అధికారంలోకి వచ్చాక వేధించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
బాధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల సాయం:
అక్కెపెల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మరణించిన బాధిత రైతు కుటుంబాలను కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు