కండ్రిగూడెం వద్ద అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
రెండు నెలల క్రితమే పట్టుబడినా కొనసాగుతున్న అక్రమ రవాణా
ఏలూరు జిల్లా కండ్రిగూడెం వద్ద అక్రమంగా తరలిస్తున్న 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. దెందులూరుకు చెందిన తాళ్లూరి నాగరాజు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రెవెన్యూ శాఖ డీటీ రమేష్, విజిలెన్స్ ఎస్‌ఐ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో నాగరాజును అదుపులోకి తీసుకుని, అతనిపై 6ఏ, 7(ఐ) కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యాన్ని అందిస్తోంది. అయితే కొంతమంది అక్రమంగా బియ్యాన్ని సేకరించి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కాగా, తాళ్లూరి నాగరాజు వద్ద రెండు నెలల క్రితం కూడా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ మరోసారి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడటంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని, పునరావృతంగా నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు