కరీంనగర్–వరంగల్ హైవే రెడీ.. ట్రయల్ రన్‌కు సిద్ధం
68 కిలోమీటర్లకు తగ్గనున్న దూరం.. అక్టోబర్ 1 నుంచి టోల్ వసూళ్లకు సన్నాహాలు
కరీంనగర్–వరంగల్ | Ntoday News
కరీంనగర్–వరంగల్ మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసే గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి NH-563 ట్రయల్ రన్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం కరీంనగర్ నుంచి వరంగల్ మధ్య ఉన్న దూరం సుమారు 72 కిలోమీటర్లు ఉండగా, కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే ఈ దూరం సుమారు 68 కిలోమీటర్లకు తగ్గనుంది.
కొత్త రహదారిపై ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. కార్లలో కరీంనగర్ నుంచి వరంగల్‌కు సుమారు 45 నిమిషాల నుంచి గంటలోపు చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రతి కిలోమీటర్‌కు సోలార్ సీసీ కెమెరాలు
హైవేపై భద్రత, ట్రాఫిక్ పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి కిలోమీటర్‌కు రెండు చొప్పున సోలార్ ఆధారిత సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. కొత్తగట్టు టోల్ ప్లాజా నుంచి వాహనాల రాకపోకలను 24 గంటల రియల్‌టైమ్ మానిటరింగ్ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
ట్రయల్ రన్ పూర్తయిన అనంతరం అక్టోబర్ 1 నుంచి కొత్తగట్టు టోల్ ప్లాజా వద్ద వాహనాల నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కరీంనగర్–వరంగల్ మధ్య ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు రెండు నగరాల మధ్య రవాణా మరింత సులభతరం కానుంది.