సప్తగిరి కాలనీలో రోడ్డు కాదు.. రణరంగమే!
చిన్న వర్షానికే చెరువును తలపిస్తున్న రహదారి.. సమస్య పరిష్కరించకుంటే మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని కాలనీవాసుల హెచ్చరిక
ఘట్కేసర్ | Ntoday News
ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం 8వ డివిజన్ నారాపల్లి సప్తగిరి కాలనీ రోడ్ నంబర్ 1 దుస్థితి స్థానికులకు నిత్య నరకయాతనగా మారిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్డు లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే రహదారి మొత్తం నీటమునిగి చెరువును తలపిస్తోందని వాపోతున్నారు.
వర్షం ఆగిపోయినప్పటికీ రహదారిపై నీరు మాత్రం తొలగిపోకుండా రోజుల తరబడి నిలిచిపోతోందని స్థానికులు చెబుతున్నారు. నీరు బయటకు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ మార్గం లేకపోవడంతో రోడ్డుపై బురద, నీరు పేరుకుపోతున్నాయని తెలిపారు. దీంతో వాహనదారులు, పాదచారులు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం
సమస్య పరిష్కారం కోసం పలుమార్లు సంబంధిత ఎంఎంసీ అధికారులు, డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ప్రజలు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి సప్తగిరి కాలనీ రోడ్ నంబర్ 1ను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరుతున్నారు.
డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మించాలని డిమాండ్
రహదారిపై నీటి నిల్వకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి, సీసీ రోడ్డును నిర్మించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
సమస్యను అధికారులు ఇకనైనా నిర్లక్ష్యం చేస్తే ఆందోళనను ఉధృతం చేస్తామని, అవసరమైతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన చేపడతామని సప్తగిరి కాలనీ వాసులు హెచ్చరించారు.