మేడ్చల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ మాఫియా..
మేడ్చల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ మాఫియా..
- 22ఏ నిబంధనలకు తిలోదకాలు
- బోగస్ పత్రాలతో అడ్డగోలు దస్తావేజులు
- అధికారులు-దళారుల కుమ్మక్కు పై తీవ్ర ఆరోపణలు
Medchal : మేడ్చల్ జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెక్షన్ 22ఏ నిబంధనలను పక్కనపెట్టి నిషేధిత ఆస్తుల లావాదేవీలు, నకిలీ ధ్రువపత్రాలతో దస్తావేజుల తయారీ, అసలు యజమానులకు తెలియకుండానే ఆస్తుల బదలాయింపు వంటి వ్యవహారాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కొందరు అధికారులు, డాక్యుమెంట్ రైటర్లు, దళారులు కలిసి సిండికేట్ గా ఏర్ప డి వ్యవహారాలు నడిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి కే కుత్బుల్లాపూర్ పరిధిలో సబ్జి స్ట్రార్ జ్యోతి అక్రమ రిజిస్ట్రేషన్ల కేసు అరెస్టు కావడం సంచలనం సృష్టించగా.. తాజాగా కీసర మాజీ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ యూస ఫ్-ఉర్-రెహమాన్ అరెస్టు కావడం రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై మరోసారి చర్చకు దారితీసింది.
మాజీ ఎస్సార్ అరెస్ట్
కీసర పరిధిలో భౌతికంగా ఉనికిలో లేని భూములకు సైతం దస్తావేజులు సృష్టించి, వాటి ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు సహకరించిన కేసులో మాజీ సబ్జిస్ట్రార్ మహమ్మద్ యూస ఫ్-ఉర్-రెహమాన్ను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి నేరగాళ్లు, రియలర్లతో కుమ్మక్కె దాదాపు రూ.4.11 కోట్ల విలువైన 11 మోసపూరిత రిజిస్టేషన్లకు సహకరించినట్లు దర్యాప్తు లో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ అరెస్టు నేపథ్యంలో జిల్లాలోని ఇతర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ అనుమానాస్పద రిజిస్ట్రేషన్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లంచం ఇస్తేనే..
జిల్లాలోని కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సామాన్యులు నేరుగా పనులు పూర్తి చేసుకోలేని పరిస్థితి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళారుల ద్వారా ముడుపులు చెల్లిస్తేనే పనులు వేగంగా పూర్తవుతున్నాయని, లేదంటే చిన్నచిన్న కారణాలను చూపుతూ ఫైళ్లను రోజుల తరబడి పెండింగ్లో పెడుతున్నారని పలువురు భూయజమానులు ఆరోపిస్తున్నారు. బోడుప్పల్ వివేకానందనగర్ లోని సర్వే నంబర్ 88, ప్లాట్ నం. 68కు సంబంధించిన పార్టిషన్ రిజిస్ట్రేషన్లో లీగల్ హెయిర్ సర్టిఫికెట్ లేదన్న కారణంతో ఏజెంట్ల ద్వారా రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించడం చర్చనీయాంశమైంది.
బోగస్ పత్రాల కలకలం
కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యా లయ పరిధిలోనూ నకిలీ పత్రాలు వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నా యి. నిజాంపేట్ సర్వే నంబర్ 102 లోని స్థలాన్ని కాజేసేందుకు అసలు యజమానులకు సంబంధించిన తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలు, బాలానగర్ తహశీల్దార్ పేరుతో నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. ఈ బోగస్ పత్రాల ఆధారంగా సేల్డీడ్ పూర్తి చేయగా.. అసలు బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా జీడిమెట్ల పరిధిలోని సర్వే నంబర్లు 192, 193లోని ప్లాట్ నంబర్ A-36కు సంబంధించి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పేరుతో నకిలీ నిరభ్యంతర పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటి ఆధారంగా డాక్యుమెంట్ నంబర్లు 16297/2026, 16299/2026తో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. అదే ఆస్తిని మరోసారి విక్రయించేందుకు ప్రయత్నించడంతో నకిలీ పత్రాల వ్యవహారం బయటపడినట్లు బాధితులు చెబుతున్నారు.
22ఏ పేరుతో అడ్డగింతలు..
నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్కు అర్హత ఉన్న ఆస్తుల విషయంలోనూ 22ఏ జాబితాను కారణంగా చూపుతూ ప్రజలను తిప్పుతున్నారన్న ఆ రోపణలున్నాయి. అదే సమయంలో దళారుల ద్వారా ముడుపులు అంధిత వివాదాస్పద లేదా నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్లు వేగంగా పూర్తవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడంతో పాటు.. అసలు భూయజమానుల ఆస్తి హక్కులకు తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉంది,
దళారులదే రాజ్యమా?
నకిలీ పత్రాలపై అనుమానాలు ఉన్నప్పటికీ కమీషన్ల కోసం వాటిని పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు అధికార యంత్రాంగంపై తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలోనే మధ్యవర్తుల ప్రమేయం పెరుగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కీసర మాజీ సబ్జిస్ట్రార్ అరెస్టు, కుత్బుల్లాపూర్ పరిధిలో నకిలీ పత్రాల ఆరోపణలు, 22ఏ ఆస్తులపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలోని అన్ని సబ్జిస్ట్రార్ కార్యాలయాల్లో సమగ్ర విచారణ చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది.