పోచంపల్లి చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం: మంత్రి తుమ్మల
శుక్రవారం రోజున హెటెక్స్ లో నిర్వహించిన థ్రెడ్ పోచంపల్లి కార్యక్రమానికి వ్యవసాయ మరియు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు,పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ , చేనేత జౌళి శాఖ మంత్రి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “Telangana Rising” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన “ థ్రెడ్ పోచంపల్లి” (Thread Pochampally ) చేనేత వస్త్ర ప్రదర్శనను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోచంపల్లి ఇక్కత్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇక్కడి నేతన్నల నైపుణ్యం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన చేనేత సంప్రదాయాన్ని భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు లభించిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ ఇక్కడి కళాకారుల సృజనాత్మకతకు, నైపుణ్యానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపని మంత్రి తెలిపారు. భూదాన్ ఉద్యమానికి చారిత్రక కేంద్రంగా నిలిచిన పోచంపల్లికి ప్రత్యేక స్థానం ఉందని, పోచంపల్లి రుమాళ్లు, ఇక్కత్ చీరలకు ప్రపంచ మార్కెట్‌లో మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండున్నర సంవత్సరాల్లో చేనేత రంగం అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం సుమారు రూ.1,400 కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. నేతన్నల ఉపాధికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.గ్లోబలైజేషన్ పోటీని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సంస్థ ద్వారా చేనేత కుటుంబాల పిల్లలకు ఆధునిక డిజైన్లు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందించి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. డూప్లికేట్ ఉత్పత్తుల వల్ల చేనేత బ్రాండ్‌కు కలిగే నష్టాన్ని నివారించడంలో కూడా ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ఈ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.రాబోయే మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనకు మరింత మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా చర్యలు తీసుకుని చేనేత కళాకారులకు ప్రోత్సాహం అందించాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు
నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పోచంపల్లి నేతన్నలు అగ్గిపెట్టెలో పట్టేంత సన్నని చీరలను నేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అందుకే పోచంపల్లి 'సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా'గా ఖ్యాతి గడించింది. ఈ ఎగ్జిబిషన్ ద్వారా చేనేత కార్మికులకు మరిన్ని మార్కెటింగ్ అవకాశాలు, వారి శ్రమకు తగిన ఆదాయం లభించాలి.థ్రెడ్ పోచంపల్లి చేనేత కళా వైభవాన్ని ప్రపంచానికి మరింత చేరువ చేసే లక్ష్యంతో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జూన్ 5,6, 7 తేదీలలో నిర్వహిస్తున్న థ్రెడ్ పోచంపల్లి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టెక్స్టైల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సహకారంతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. చేనేత కార్మికుల అపూర్వ నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు వారికి మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్‌ను సందర్శించిన మంత్రి, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , హ్యాండ్లూమ్స్ శాఖ అధికారులు, చేనేత సహకార సంఘాలు, మాస్టర్ వీవర్లు, టై అండ్ డై సంఘాలు, చేనేత సోదరులు, అలాగే ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతన్నలందరికీ అభినందనలు తెలిపారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 12 వేల మంది చేనేత కార్మికులు, అనుబంధ వృత్తిదారులు తమ జీవనోపాధిని ఈ రంగంపైనే ఆధారపడి కొనసాగిస్తున్నారని మంత్రి తెలిపారు. వారి కష్టానికి తగిన గుర్తింపు, ఉత్పత్తులకు విస్తృత మార్కెట్, మెరుగైన ఆదాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు.సుమారు 100 చేనేత స్టాల్స్‌తో పాటు స్వయం సహాయక సంఘాలు, అనుబంధ సంస్థల స్టాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారులకు చేనేత ఉత్పత్తుల వైవిధ్యాన్ని పరిచయం చేస్తున్నారని చెప్పారు.పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక తెలియా రుమాలు వంటి భౌగోళిక గుర్తింపు (GI) పొందిన ఉత్పత్తులు యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయని మంత్రి పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ చేనేత కళ, నేతన్నల అపూర్వ నైపుణ్యం, సంప్రదాయ వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా నిలుస్తుందన్నారు.పోచంపల్లి నేతన్నల ప్రతిభ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని మంత్రి కొనియాడారు. అగ్గిపెట్టెలో పట్టేంత సన్నని చీరలను నేసి తమ కళాత్మకతను చాటుకున్నారని, వారి నైపుణ్యం వల్లే పోచంపల్లి "సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా"గా ఖ్యాతి గడించిందన్నారు.నిజాం కాలం నుంచే పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు ఉందని, అరబ్ దేశాలకు తెలియా రుమాళ్లు, గాజులు, పూసలు ఎగుమతి చేసిన ఘన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందన్నారు.భారతదేశ సామాజిక చరిత్రలో కూడా పోచంపల్లికి ప్రత్యేక స్థానం ఉందని మంత్రి గుర్తుచేశారు. 1951 ఏప్రిల్ 18న ఆచార్య వినోబా భావే ఇక్కడే భూదానోద్యమాన్ని ప్రారంభించారని, ఆయన పిలుపుతో వెదిరె రామచంద్రారెడ్డి 100 ఎకరాల భూమిని పేదలకు దానం చేయడం ద్వారా సామాజిక చైతన్యానికి నాంది పలికారని పేర్కొన్నారు.ఇక్కడి నేతన్నలు ఇక్కత్, డబుల్ ఇక్కత్ పద్ధతుల్లో పత్తి, పట్టు, సికో వస్త్రాలను తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని తెలిపారు. దారాలకు ముందుగానే ప్రత్యేక డిజైన్లు కట్టి రంగులు అద్దిన అనంతరం మగ్గంపై నేసి, చీరకు ఇరువైపులా ఒకే నమూనా కనిపించేలా రూపొందించడం వారి అసాధారణ నైపుణ్యానికి నిదర్శనమన్నారు. ఈ విశిష్ట కళకు గుర్తింపుగా 2003లో జీఐ ట్యాగ్ లభించిందని చెప్పారు.పోచంపల్లి, పుట్టపాక, కోయల్‌గూడం, సిరిపురం, భువనగిరి, గట్టుప్పల, చౌటుప్పల్ ప్రాంతాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అనేక గ్రామాల్లో వేలాది కుటుంబాలు చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయని మంత్రి తెలిపారు.చేనేత రంగంలో విశేష సేవలు అందించి పద్మశ్రీ పురస్కారాలు పొందిన గజం గోవర్ధన్, గజం అంజయ్య, అలాగే ఆసు యంత్రాన్ని అభివృద్ధి చేసి చేనేత కార్మికుల శ్రమను తగ్గించిన చింతకింది మల్లేశం సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.పోచంపల్లి చీరలకు ఉన్న అంతర్జాతీయ గుర్తింపుకు నిదర్శనంగా ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది వాటిని ధరిస్తున్నారని, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పోచంపల్లి వస్త్రాలు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని మంత్రి పేర్కొన్నారు."ఒక చీర వెనుక నేతన్న కుటుంబం కష్టం, కళ, జీవన పోరాటం దాగి ఉంటుంది. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం అంటే కేవలం వస్త్రాన్ని కొనుగోలు చేయడం కాదు... ఒక కుటుంబానికి అండగా నిలవడం" అని మంత్రి అన్నారు.ఈ ఎగ్జిబిషన్ ద్వారా చేనేత కార్మికులకు మరిన్ని మార్కెటింగ్ అవకాశాలు లభించాలని, వారి శ్రమకు తగిన గౌరవం, ఆదాయం దక్కాలని, పోచంపల్లి చేనేత వైభవం ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ ద్వారా చేనేత కార్మికులకు మరిన్ని మార్కెటింగ్ అవకాశాలు లభించాలని, వారి కష్టానికి గుర్తింపు రావాలని ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వేలాది కుటుంబాలు చేనేత వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ చేనేత కార్మికులకు మరిన్ని మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని, పోచంపల్లి చేనేత వైభవం ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తడక వెంకటేశం, జిల్లా ఏడి చేనేత అధికారి శ్రీనివాస్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత కార్మికులు మరియు పెద్ద సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు.