నెమలి గ్రామంలో రూ.81 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం
అంతర్గత రహదారులకు మహర్దశ.. ప్రారంభించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రూ.81 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను శుక్రవారం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీ నిధులతో నిర్మించిన ఈ రహదారులతో గ్రామంలోని పలు ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వర్షాకాలంలో బురద, గుంతల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొత్త రహదారులు ఎంతో ఉపశమనం కలిగించనున్నాయి. విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులు, వాహనదారుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. గ్రామంలోని అంతర్గత రహదారుల అభివృద్ధితో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేస్తూ అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గోగులమూడి శ్రీలక్ష్మి, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.