నిరుపేద విద్యార్థులు ఫీజులు కట్టలేక అవస్థలు
నిరుపేద విద్యార్థులు ఫీజులు కట్టలేక అవస్థలు
- ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎన్‌జీ కళాశాలలో నిరసన
తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో నాగార్జున డిగ్రీ కళాశాలలో గురువారం ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కొంపల్లి సూర్య మాట్లాడుతూ తెలంగాణలోని దాదాపు 18 లక్షల మంది పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆధారమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. గత మూడేళ్లుగా సుమారు 11,000 కోట్ల బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దోస్త్ ద్వారా అడ్మిషన్లు పొందిన విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేయడానికి వెళ్తే ప్రభుత్వ కళాశాలలు సైతం ముందే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. దీనివల్ల నిరుపేద విద్యార్థులు ఫీజులు కట్టలేక ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి దాపురించింది అన్నారు. బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిపర్తి శివ, నాయకులు జయందర్, కార్తీక్, శివతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.