పెనుగొలనులో ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలను బుధవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ భాష, యాస, ప్రజల జీవన విధానాన్ని తన రచనల ద్వారా తరతరాలకు అందించిన మహోన్నత కవి కాళోజీ అని కొనియాడారు. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో రచనలు చేసి బహుభాషా రచయితగా గుర్తింపు పొందారని తెలిపారు.
ప్రజల్లో చైతన్యం నింపేందుకు ‘నా గొడవ’, ‘ఇది నా గొడవ’, ‘కాళోజీ కథలు’, ‘తుది విజయం మనదే’, ‘పరమార్థం’, ‘భారతీయ జీవన విధానం’ వంటి రచనలు చేశారని పేర్కొన్నారు. 25 ఏళ్ల వయసులోనే సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన దేశభక్తుడని గుర్తుచేశారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కలాన్ని, గళాన్ని ఆయుధాలుగా మలిచి పోరాడారని వక్తలు తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం కూడా పౌర హక్కుల కోసం, అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా, మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చివరి శ్వాస వరకు పోరాడారని అన్నారు.
కాళోజీ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1992లో పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించిందని తెలిపారు. ఆయన జయంతిని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కవి, కథకుడు, ఉద్యమకారుడిగా ప్రజల కోసం జీవితాంతం పోరాడిన కాళోజీ నారాయణరావు 2002 నవంబర్ 13న కన్నుమూశారని గుర్తుచేశారు.
అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞ కృష్ణ, సాగరపు శ్రీను, బాణాల నరేష్, దేవర అంజలి, ఇనపనూరి శిరీష, దూదేకుల రంజాన్ బీతో పాటు గ్రామస్తులు, అంగన్‌వాడీ చిన్నారులు పాల్గొన్నారు.