ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన - మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు హెల్త్ సెంటర్‌కు శంకుస్థాపన – పశువుల హాస్టల్ ప్రారంభం
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. మైలవరం మండలం కనిమెర్లతండాలో రూ.36 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం పోరాట నగర్లో రూ.10 లక్షల ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో నిర్మించిన పశువుల వసతి శాలను కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు వల్ల ప్రజలకు వైద్య సేవలు చేరువవుతాయని తెలిపారు. ప్రజారోగ్య సంరక్షణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో రూ.9.35 కోట్ల వ్యయంతో 29 హెల్త్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ, సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పశువుల హాస్టల్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. పశువులకు మేత, తాగునీరు, ఆశ్రయం వంటి సౌకర్యాలు కల్పించడం ద్వారా పశుపోషకులకు మేలు జరుగుతుందని చెప్పారు. చిన్న, సన్నకారు రైతులు, పశుపోషకుల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వివరించారు.
పాలు నిత్యావసర వస్తువుగా మారిన నేపథ్యంలో పాడి పరిశ్రమ అభివృద్ధి అవసరమని అన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని పాడి పశువుల పెంపకం పెంచి, నాణ్యమైన పాల ఉత్పత్తి సాధించాలని సూచించారు. తద్వారా జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు.
స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ రిక్షాను ప్రారంభించారు. వెదురుబీడెం గ్రామంలో టీడీపీ కుటుంబ సభ్యుడు కొలుసు రంగారావును పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానికంగా ఘన స్వాగతం లభించింది.
ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), కూటమి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.