ప్రపంచ ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు మరింత సంసిద్ధంగా ఉండాలి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు మరింత దృఢంగా, సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. పరస్పరం అనుసంధానమైన ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒక్క ప్రాంతానికే పరిమితం కాదని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు రెండో రోజు ‘స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత: సమ్మిళిత ప్రపంచ వృద్ధి కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం’ అనే అంశంపై జరిగిన బహిరంగ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. ప్రపంచంలో ఉద్రిక్తతలు నిరంతరం పెరుగుతున్నాయని, వాటి ప్రభావం సామాన్య ప్రజల జీవితాలపై గణనీయంగా పడుతోందని పేర్కొన్నారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా గొలుసుల అంతరాయాలు ఈ పరిస్థితిని స్పష్టం చేశాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు క్లిష్ట పరిస్థితులను తట్టుకుని తిరిగి బలంగా నిలబడే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. సవాళ్లను ముందుగానే గుర్తించడం, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటం, అవసరమైన సమయంలో తక్షణ చర్యలు చేపట్టడం అత్యంత కీలకమని అన్నారు. అంటువ్యాధుల నివారణ, వాటిపై వేగంగా స్పందించేందుకు ఉద్దేశించిన ‘బ్రిక్స్ సమగ్ర ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’పై ఏకాభిప్రాయం కుదిరిందని ప్రధాని తెలిపారు. విపత్తు నిర్వహణ కోసం ‘ముందస్తు హెచ్చరిక డేటా అనుసంధాన మార్గదర్శకాలు’ రూపొందించినట్లు వెల్లడించారు. సదస్సులో భాగంగా భారత్ మండపంలో ప్రధాని మోడీతో పాటు బ్రిక్స్ దేశాల నేతలు బృంద ఫొటో దిగారు. ప్రధాని మోడీకి ఇరువైపులా రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నిల్చున్నారు.
గ్లోబల్ సౌత్ దేశాలు సమిష్టిగా ఎదగాలి
ప్రపంచం ఎన్నడూ చూడని లోతైన మార్పులకు లోనవుతోందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ సౌత్ దేశాలు సమిష్టిగా ఎదుగుతూ బహుధ్రువ ప్రపంచ వ్యవస్థకు కీలక చోదక శక్తిగా మారుతున్నాయని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన జిన్‌పింగ్.. అంతర్జాతీయ పరిస్థితులు సంక్లిష్టంగా, అస్థిరంగా మారుతున్న నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు గ్లోబల్ సౌత్ దేశాలతో కలిసి అంతర్జాతీయ వ్యవహారాల్లో సానుకూల, స్థిరీకరణ పాత్ర పోషించాలని సూచించారు. సార్వభౌమ సమానత్వం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం వంటి అంతర్జాతీయ నిబంధనలను పరిరక్షించాలని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలు ఆచరణాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, పారిశ్రామిక మరియు సరఫరా గొలుసుల స్థిరత్వాన్ని కొనసాగించాలని సూచించారు. అదే సమయంలో ఆవిష్కరణలు, సంప్రదాయ పరిశ్రమలతో పాటు అభివృద్ధి చెందుతున్న కొత్త పరిశ్రమలపై దృష్టి సారించాలని అన్నారు. బ్రిక్స్ సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఐదు కార్యక్రమాలను కూడా జిన్‌పింగ్ ప్రతిపాదించారు.