చింతలపూడి ఫైర్ స్టేషన్ సెంటర్‌లో ప్రయాణికుల అవస్థలు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
బస్సుల కోసం గంటల తరబడి నిలబడుతున్న వృద్ధులు, మహిళలు
చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ప్రయాణికుల ఇబ్బందులు తప్పడం లేదు. ఏలూరు వైపు వెళ్లే బస్సుల కోసం ప్రతిరోజూ పలువురు ప్రయాణికులు ఈ ప్రాంతంలో వేచి ఉంటున్నారు. అయితే ప్రయాణికులు కూర్చునేందుకు కనీసం సిమెంట్ బల్లలు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో వచ్చే ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండే సమయంలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సు రాక ఆలస్యమైతే గంటల తరబడి నిలబడటం ఇబ్బందికరంగా మారుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన రహదారి పక్కనే ప్రయాణికుల రద్దీ ఉండే ప్రాంతంలో కనీస వేచి ఉండే సౌకర్యాలు లేకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఫైర్ స్టేషన్ సెంటర్‌లో సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రయాణికులు కొంతసేపు సౌకర్యంగా వేచి ఉండేలా కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు.