టీబీ నిర్మూలనకు ఉచిత మొబైల్ ఎక్స్‌రే సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి
టీబీ నిర్మూలనకు ఉచిత మొబైల్ ఎక్స్‌రే సేవలు
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి
ధర్మపురి: టీబీ వ్యాధి నిర్మూలన అభియాన్‌లో భాగంగా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ శాఖ, జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉచిత మొబైల్ ఎక్స్‌రే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ (DY DMHO) డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజలందరూ వైద్య శాఖ అందిస్తున్న ఉచిత టీబీ పరీక్షలు, మొబైల్ ఎక్స్‌రే సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. టీబీ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయంగా ప్రతి నెలా ₹1,000 నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోందని తెలిపారు. గత నాలుగు నెలల్లో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా టీబీ బాధితులకు సుమారు ₹45 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు.
అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ.. టీబీ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత వారం బస్తీ దవాఖానలో, ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, సిబ్బందికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, కౌన్సిలర్లు అయ్యోరి వేణుగోపాల్, ముడుసుల ప్రశాంత్, విరవేణి నాగలక్ష్మి, సంగి ఆనంద్, కో-ఆప్షన్ సభ్యురాలు సుల్తానా, డాక్టర్ వివేక్, మున్సిపల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.