సర్వేపల్లి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి
ఉపాధ్యాయులు భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్: ఉపాధ్యాయుల సేవలు, వారి గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. విజ్ఞానాన్ని అందించే గురువు సమాజానికి విజ్ఞాన వృక్షం లాంటి వారని పేర్కొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలిచే ఉపాధ్యాయులను నిత్యం గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను స్మరించుకున్న పవన్ కల్యాణ్.. ఆయన చూపిన విద్యా విలువలు, ఆదర్శాలను ప్రతి ఉపాధ్యాయుడు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా, నైతిక విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పౌరస్ఫూర్తిని పెంపొందించేలా తీర్చిదిద్దాలని అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని పేర్కొన్న పవన్ కల్యాణ్.. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తయారు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో పనిచేస్తూ, బంగారు భారతావనిని నిర్మించే భావితరాలను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.