రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి
హనుమకొండ: రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆహార నాణ్యత, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా హాస్టళ్లలో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి అవసరమైన శుభ్రత పనులు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాలు, మెనూ అమలు, వసతి సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు.
హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పరిసరాల పరిశుభ్రత, ఆహార తయారీ విధానం తదితర అంశాలను అధికారులు పరిశీలించి సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.