తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. అక్రమాలకు చెక్!
తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. అక్రమాలకు చెక్! ఆగస్టు 15న పంపిణీకి శ్రీకారం
హైదరాబాద్, ఆగస్టు 9: తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.
నకిలీ రేషన్ కార్డులు, అక్రమాలను అరికట్టేలా కొత్త కార్డులను మార్పులు చేయడానికి వీలు లేని విధంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కార్డులపై ఉన్న వివరాలను ఇతరులు మార్చకుండా ఉండేందుకు ప్రత్యేక భద్రతా లక్షణాలతో పాటు లామినేషన్ చేయనున్నారు.
ఈ-కేవైసీ పూర్తయిన తర్వాతే కార్డుల జారీ
లబ్ధిదారుల ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆధార్ వివరాల ఆధారంగా స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. కుటుంబానికి సంబంధించిన వివరాలతో పాటు ఇంటి యజమాని లేదా ఇంటి ఇల్లాలి ఫొటోతో కూడిన కార్డును అందించనున్నట్లు సమాచారం.
కొత్త విధానంతో రేషన్ కార్డుల విషయంలో నకిలీలు, అక్రమాలు తగ్గడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ రేషన్ సరుకులు మరింత పారదర్శకంగా అందే అవకాశం ఉంది.