తల్లి జ్ఞాపకార్థం.. 290 మంది రైతుల అప్పులు మాఫీ!
తల్లి జ్ఞాపకార్థం.. 290 మంది రైతుల అప్పులు మాఫీ! రూ.89.89 లక్షలు చెల్లించి 30 ఏళ్ల రుణభారం నుంచి విముక్తి.. రైతుల కళ్లల్లో ఆనందబాష్పాలు
గుజరాత్: తల్లి జ్ఞాపకార్థం ఏదైనా చేయాలని అనుకున్న ఇద్దరు సోదరులు.. ఎవరూ ఊహించని విధంగా 290 మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. తల్లి వర్ధంతి సందర్భంగా ఆచారాలు, క్రతువులకే పరిమితం కాకుండా.. ఎన్నో ఏళ్లుగా అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులను ఆదుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏకంగా రూ.89.89 లక్షలు వెచ్చించి 290 మంది రైతుల రుణాలను పూర్తిగా తీర్చేశారు.
గుజరాత్‌లోని జీరా గ్రామానికి చెందిన 290 మంది రైతులు సుమారు మూడు దశాబ్దాలుగా ఓ మోసపూరిత సహకార రుణ వ్యవహారం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పటి నుంచి వారి భూములు రుణభారంతో కుదవపడి ఉండటంతో పాటు కొత్తగా రుణాలు పొందే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ పథకాల ద్వారా అందాల్సిన ఆర్థిక సహాయం కూడా సక్రమంగా అందకపోవడంతో రైతులు ఏళ్ల తరబడి ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు.
ఈ విషయం సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త బాబూభాయ్ జీరావాలా, ఆయన సోదరుడి దృష్టికి వచ్చింది. తమ తల్లి వర్ధంతిని పురస్కరించుకుని ఆమె జ్ఞాపకార్థం సమాజానికి ఉపయోగపడే పని చేయాలని వారు నిర్ణయించుకున్నారు. పేదలకు, రైతులకు అండగా నిలవడమే తల్లికి ఇచ్చే నిజమైన నివాళి అని భావించారు.
అనుకున్నదే తడవుగా బ్యాంకులో దాదాపు రూ.89.89 లక్షలు జమ చేసి 290 మంది రైతులపై ఉన్న రుణాలను పూర్తిగా తీర్చేశారు. దీంతో దశాబ్దాలుగా రైతులను వెంటాడుతున్న అప్పుల భారం ఒక్కసారిగా తొలగిపోయింది. అనంతరం రైతులకు ‘నో డ్యూస్’ ధ్రువపత్రాలు అందజేశారు.
30 ఏళ్లుగా అప్పుల బాధతో సతమతమైన రైతులు రుణ విముక్తి పత్రాలు చేతుల్లోకి రావడంతో భావోద్వేగానికి గురయ్యారు. కొందరి కళ్లలో ఆనందబాష్పాలు కనిపించగా.. మరికొందరు సోదరుల ఉదారతను ప్రశంసించారు. తమ తల్లి జ్ఞాపకాన్ని కేవలం ఒక కుటుంబ కార్యక్రమానికే పరిమితం చేయకుండా.. వందలాది రైతుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేలా మలచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తల్లి జ్ఞాపకానికి విలువైన నివాళి అంటే ఇదేనేమో.. అంటూ స్థానికులు బాబూభాయ్ జీరావాలా, ఆయన సోదరుడి సేవాభావాన్ని కొనియాడుతున్నారు. ఒక కుటుంబం చేసిన ఈ మంచి పని 290 మంది రైతుల కుటుంబాల్లో కొత్త ఆశలు నింపింది. దశాబ్దాలుగా భూములపై ఉన్న రుణభారం తొలగిపోవడంతో రైతులు ఇక స్వేచ్ఛగా తమ వ్యవసాయాన్ని కొనసాగించే అవకాశం లభించింది.
డబ్బు సంపాదించడం కంటే.. ఆ సంపదతో ఎంతమంది జీవితాల్లో మార్పు తీసుకురాగలమన్నదే అసలైన మానవత్వానికి కొలమానం అని ఈ సోదరులు చాటిచెప్పారు. తల్లి జ్ఞాపకార్థం చేసిన ఈ మహోన్నత సాయం.. రైతుల జీవితాల్లో నిలిచిపోయే జ్ఞాపకంగా మారింది.