తల్లికి వందనం–మెగా పీటీఎం 4.0కు శ్రీకారం.. నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు
ఏలూరు, జూలై 24: రాష్ట్రంలో విద్యా రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలోని శ్రీ అన్నే రామకృష్ణయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన "తల్లికి వందనం–మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ (మెగా పీటీఎం)–4.0" కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
రాష్ట్రంలో రెండో ఏడాది 67.47 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లను జమ చేయడం కూటమి ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో 2.40 లక్షల మంది తల్లులకు, 2.88 లక్షల మంది విద్యార్థులకు రూ.361.38 కోట్లు, నూజివీడు నియోజకవర్గంలో 15,894 మంది తల్లులకు, 33,764 మంది విద్యార్థులకు రూ.43.89 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.
విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం పెరిగిందని, రాజకీయ జోక్యానికి స్వస్తి పలికి విద్యాబోధనపై పూర్తి దృష్టి సారించామని తెలిపారు. ప్రతి తరగతి గదికి ఉపాధ్యాయుడు ఉండేలా 16,400 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు.
గతంలో అమ్మఒడి అమలులో లోపాలు ఉన్నాయని విమర్శిస్తూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి అర్హ విద్యార్థికి రూ.13 వేల చొప్పున నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. ఎవరైనా లబ్ధి పొందకపోతే సచివాలయం లేదా మండల కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
మెగా పీటీఎం–4.0 ద్వారా విద్యార్థుల చదువు, ప్రవర్తన, లోటుపాట్లపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి చర్చించే అవకాశం లభిస్తుందని, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఇది కీలక వేదికగా నిలుస్తుందని మంత్రి అన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను కూడా విద్యార్థులకు అలవర్చాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమానికి ముందు తల్లికి వందనం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో మంత్రి మమేకమయ్యారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను పరిశీలించి అభినందించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సన్మానించారు. అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి మెగా పీటీఎం ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ, డిప్యూటీ విద్యాశాఖ అధికారి సుధాకర్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.