తునికిపాడు ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలోని మెయిన్ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో ప్రధానోపాధ్యాయులు సంగెపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని, మంచి ఉపాధ్యాయుడిని విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకుంటారని తెలిపారు.
విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి బోధన
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. రెండో తరగతి విద్యార్థిని వి. చైత్ర యామిని, ఐదో తరగతి విద్యార్థులు వి. సౌజన్య, ఎన్. సారిక, వి. యశ్వంతక, కే. హెప్సిబా ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు.
విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రను పోషిస్తూ తోటి విద్యార్థులకు బోధించడం పాఠశాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆదూరి వెంకట నరసింహారావు, యలగందుల శ్రీనివాసరావు, పిల్లి రవికుమార్ పాల్గొన్నారు.