ఉగాది, రంజాన్‌కు స్పెషల్ బస్సులు
హైదరాబాద్, మార్చి 16: ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా వరుస సెలవులు రావడంతో సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది.
ముఖ్యంగా మార్చి 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆ రోజుల్లో అవసరాన్ని బట్టి అదనపు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే మార్చి 23వ తేదీన కూడా తగిన ఏర్పాట్లు చేపట్టారు.
ప్రత్యేక బస్సులకు అయ్యే డీజిల్ ఖర్చులు, నిర్వహణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును ప్రభుత్వం ఇప్పటికే కల్పించింది. 2003లో జారీ చేసిన జీవో నంబర్ 16 ప్రకారం పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే ప్రత్యేక బస్సుల్లో మాత్రమే టికెట్ ధరలను గరిష్ఠంగా ఒకటిన్నర రెట్లు వరకు పెంచుకునే అవకాశం ఉంది.
దీంతో ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. మార్చి 17, 18 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 23 తేదీన ఈ చార్జీలు అమల్లో ఉంటాయి. అయితే సాధారణ బస్సుల్లో మాత్రం సాధారణ చార్జీలే కొనసాగుతాయి.
ఇక రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకం ప్రకారం పండుగ రోజుల్లో నడిచే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ప్రయాణికులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలని సంస్థ సూచించింది.