www.ntodaynews.com
విశాఖ, విజయవాడ మెట్రో రైలు – ప్రజా రవాణా దుస్థితి
తెలంగాణ
విశాఖ, విజయవాడ మెట్రో రైలు – ప్రజా రవాణా దుస్థితి
డా|| బి.గంగారావు
వ్యాసకర్త సెల్ : 94900 98792
NTODAY NEWS: ప్రత్యేక కథనం
రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ నిర్మాణానికి పూనుకుంది. ఇప్పటికే సవివర ప్రాజెక్టు రిపోర్టులు (డిపిఆర్) తయారుచేసి టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. వాస్తవానికి రాష్ట్రంలోని ఈ రెండు నగరాల్లో మెట్రో రైళ్ల నిర్మాణ ప్రతిపాదనలు గత పదేళ్ల నుండి కొనసాగుతున్నాయి. రకరకాల మెట్రో ప్రాజెక్టుల రిపోర్టులను మార్చి మార్చి తయారు చేశారు. కానీ అడుగు ముందుకు పడలేదు.
మెట్రో కారిడార్లు – నిధులు
మొదటి దశగా విశాఖపట్నంలో 46.23 కిమీ కారిడార్లు మూడు, విజయవాడలో 38.4 కిమీ కారిడార్లు రెండు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించాలని నిర్ణయించారు. విశాఖ మెట్రో రైలుకు రూ.11,498 కోట్లు, విజయవాడ మెట్రో రైలుకు రూ.10,118 కోట్లు వ్యయం అవుతుందని తేల్చారు. ఈ నిధులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరొక 20 శాతం చొప్పున భరించేలా, మిగిలిన 60 శాతం అంతర్జాతీయ సంస్థల నుండి రుణ రూపంలో సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు వ్యయంతో పాటు భూ సేకరణ కోసం విశాఖలో 100 ఎకరాలకు రూ.882 కోట్లు, విజయవాడలో 91 ఎకరాల కోసం రూ.1152 కోట్లు, రెండు చోట్లా మెట్రో రైల్ నిర్మాణ పనుల పర్యవేక్షణ సాంకేతిక సహకారం కోసం కన్సల్టెన్సీ సంస్థలకు రూ.401 కోట్ల ఫీజు చెల్లించనున్నారు. మొత్తంగా రెండు నగరాల్లో అన్నీ కలిపి మెట్రో రైల్ నిర్మాణం కోసం రూ.24,051 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మెట్రో నిర్మాణం పనులు (సివిల్ వర్క్స్) డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, ఫ్లై ఓవర్, ఎలివేటెడ్ మెట్రోస్టేషన్లు తదితర వాటి నిర్మాణాల కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం ఖర్చవుతుందని… దీనిలో విశాఖ మెట్రో రైల్‌కు రూ.4,101 కోట్లు, విజయవాడ మెట్రో రైల్‌కు రూ.3,497 కోట్లుగా నిర్ణయించారు. ఈ నిధులను విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (వి.ఎం.ఆర్.డి.ఏ) 1941 ఎకరాలు అమ్మి సేకరించాలి. ఈ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుండి సేకరించి సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్‌డిఏ) అమరావతి లోని భూముల అమ్మకం ద్వారా వచ్చే సొమ్ము నుండి కేటాయించాలని కోరింది. మిగిలిన 60 శాతం నిధులను మెట్రో రైలు పట్టాలు, సిగల్ వ్యవస్థ, రైలు కోచ్‌లు, ఇంజిన్లు, విద్యుత్, కమర్షియల్ కాంప్లెక్సులు, పార్కింగ్ వంటి వాటికి ఖర్చు చేస్తారు. ఈ 60 శాతం అనగా రూ.12,729 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థల నుండి రుణ రూపంలో సేకరించి ప్రైవేటు సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది.
గాలికొదిలేసిన విభజన చట్టం హామీ
2014 రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని పేర్కొనబడింది. ఏడాది లోపు ఫీజబిలిటీ నివేదికను కూడా తయారు చేసి కేంద్రానికి పంపాలని చట్టంలో ఉంది. దీని ప్రకారం మొత్తం రెండు నగరాల్లో చేపట్టే మెట్రో రైలు నిర్మాణ ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో భరించాల్సి ఉంటుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం మాత్రమే నిధులు కేటాయించాల్సి ఉంటుంది. కానీ ప్రాజెక్ట్ నివేదికలు తయారు చేసి కేంద్రానికి పంపడం వరకే తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాలు పరిమితం అయ్యాయి. కేంద్ర బడ్జెట్లలో వీటికి నిధులివ్వక పోయినా నోరు మెదపలేదు. ఆ తరువాత 2017 నూతన మెట్రో రైలు విధానం అమలులోకి వచ్చిందని, ఈ విధానం వల్ల విశాఖ, విజయవాడ మెట్రో రైలు నిర్మాణం 90 శాతం నిధులు ఇవ్వటం సాధ్య పడదని నరేంద్ర మోడీ ప్రభుత్వం పదే పదే చెప్పినా ఏమాత్రం స్పందించకుండా బిజెపి కి దాసోహం అయ్యారు. మెట్రో రైలు విషయంలోనే కాదు. విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు వంటి అనేక చట్టబద్ధ హామీల మీద కేంద్ర బిజెపి కి లొంగిపోయి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారు. ఇంకా బిజెపి తోనే పెనవేసుకుపోతున్నారు. ఇప్పటికీ ఈ రెండు నగరాల మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపలేదు. నిధులు ఇస్తానని ప్రకటన కూడా చేయలేదు.
భారత దేశంలో మెట్రో రైలు పరిస్థితి
దేశంలో తొలిసారిగా 1984లో కలకత్తాలో ఆ తరువాత 2002లో ఢిల్లీలో మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను నిర్మించారు. ఈ రెండూ పూర్తిగా ప్రభుత్వ పెట్టుబడులతో నిర్మితమైనవి. జైపూర్ మెట్రో, ముంబై మోనో రైలు పూర్తిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలే సొంత నిధులతో నిర్మించాయి. ముంబై, చెన్నై, బెంగళూరు, నాగపూర్, లక్నో, కోచి, అహ్మదాబాద్ నగరాల మెట్రోలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో జాయింట్ వెంచర్ మోడల్ లో ఏర్పాటు చేశారు. ఆతర్వాత చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం పూర్తిగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి)లో చేపట్టారు. ఈ నమూనాలో కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రాజెక్ట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 20 శాతం మాత్రమే నిధులు ఇస్తుంది. ఇప్పుడు ఈ మోడల్ లోనే విశాఖ, విజయవాడ రెండు నగరాల్లో చేపట్టే మెట్రోలకు 20 శాతం చొప్పున కేంద్రం నిధులిస్తుంది. 2025 ఆగస్టు నాటికి దేశంలో 23 నగరాల్లో 1,013 కిమీ పొడవైన మెట్రో రైలు నెట్‌వర్క్ ఏర్పడింది. అయితే ఎక్కువ మెట్రోలు నష్టాల్లో నడుస్తున్నాయి.
ఈ మెట్రోలలో రోజులో ప్రయాణం చేస్తారని అంచనా వేసిన ప్రయాణీకుల (రైడర్స్) సంఖ్య కంటే కేవలం 20 నుండి 30 శాతం మించి ప్రయాణం చేయడం లేదు. ఒక్క ఢిిల్లీ మెట్రోలోనే అంచనాలో 47 శాతం ప్రయాణం చేస్తున్నారు. ముంబైలో 30 శాతం, బెంగళూరులో 16 శాతం, లక్నో, జైపూర్, కాన్పూర్ వంటి నగరాల మెట్రోలో కేవలం 3 నుండి 4 శాతం లోపే ప్రయాణీకులు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు విశాఖ మెట్రోలో రోజుకి 5 నుండి 6 లక్షలు, విజయవాడ మెట్రోలో 4 నుండి 5 లక్షలు జనం ప్రయాణం చేస్తారని డిపిఆర్ నివేదికల్లో భారీ అతి అంచనాలు పేర్కొన్నారు.
ఇటీవలే హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో రైలు నిర్వహణ చేయలేక, చేసిన అప్పులు తీర్చలేక చేతులెత్తేసి నిర్వహణ నుండి ఎల్ అండ్ టి సంస్థ తప్పుకుంది. దేశంలో తొలిసారిగా పిపిపి మోడల్‌లో రూ.22 వేల కోట్ల పెట్టుబడితో 2010లో హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం ఎల్ అండ్ టి చేపట్టింది. 2017లో మూడు కారిడార్లతో 69 కిమీ మేర మెట్రో సదుపాయం ప్రారంభం అయ్యింది. నిర్దేశించుకున్న ప్రాజెక్ట్ వ్యయంకు అదనంగా 70 శాతం పెరగడం, నిర్వహణకు తగిన విధంగా ఆదాయం రాకపోవడం, ప్రయాణీకులు తగినంత లేకపోవడం, తీసుకొచ్చిన అప్పులు పెరిగి 13 వేల కోట్లకు చేరాయి. ఈ పరిస్థితుల్లో మెట్రో నిర్వహణా బాధ్యత నుండి తప్పుకుంది. ఇప్పుడు ఎల్ అండ్ టి ఈక్విటీని తెలంగాణ ప్రభుత్వం టేకోవర్ చేసి నిర్వహణా బాధ్యతను తీసుకోవాల్సి వచ్చింది. రెండో దశ చేపట్టాల్సిన మెట్రో కూడా నిలిచిపోయింది. ఇప్పుడు ఇదే తరహా పిపిపి విధానాన్ని విశాఖ, విజయవాడలో కూటమి ప్రభుత్వం అమలు చేయబోతున్నది.
మెట్రోతో ప్రజా రవాణా మెరుగు పడేనా?
విశాఖపట్నం జనాభా ప్రస్తుతం 25 లక్షలు కాగా విజయవాడ నగర జనాభా 14 లక్షలకు చేరింది. రాష్ట్రంలో అతి పెద్ద మొదటి, రెండో నగరాలుగా ఉన్నాయి. ఇప్పుడు నిర్మాణం తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు వల్ల ప్రభుత్వం ప్రకటిస్తున్నట్లు ప్రజల ప్రయాణ కష్టాలు తీరతాయా? హైదరాబాద్ మెట్రో రైలు కేవలం 3 శాతం ప్రజల రవాణా అవసరాలను మాత్రమే తీరుస్తున్నది. ఇటీవల మెట్రో టికెట్ చార్జీలను భారీగా పెంచడం తో ప్రయాణీకులు మరింత తగ్గిపోతున్నారు. అదేగాక నేడు మెట్రోలో ఎక్కువగా మధ్య తరగతి ఆదాయ వర్గాల వారు, చదువుకున్న యువతీ యువకులు తదితరులే ప్రయాణం చేస్తున్నారు. ఎక్కువమంది బస్సులు, ఆటోలు, సొంత వాహనాల్లోనే ప్రయాణం సాగిస్తున్నారు. బస్సు చార్జీల కన్నా మెట్రో చార్జీలు రెండు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్ల సామాన్య, పేద వర్గాలు మెట్రోలో ప్రయాణం చేయలేకపోతున్నారు. కనుక మెట్రోలు నగరాల ప్రజా రవాణా సమస్యను పరిష్కరించలేవు.
రాష్ట్రంలో ప్రజా రవాణా అభివృద్ధిపై పాలకులకు సమగ్ర ప్రజా దృక్పధం లేదు. ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి తగిన విధంగా కనీస స్థాయిలో కూడా నిధులు కేటాయించడం లేదు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు కూడా నేడు 10,035 తగ్గిపోయాయి. కొత్తగా కేంద్రం నుండి వస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీంతో పట్టణ లేదా రాష్ట్ర జనాభా ప్రైవేట్, వ్యక్తిగత రవాణా మీద ఆధారపడటం పెరిగిపోతున్నది. వాస్తవంగా జాతీయ పట్టణ రవాణా విధానం-2014 ప్రకారం నగరాల్లో ప్రతి లక్ష మంది ప్రజలకు 60 బస్సులు ఉండాలి. ఈ లెక్కన విశాఖలో 1500, విజయవాడలో 840 బస్సులు ఉండాలి. ప్రస్తుతం విశాఖపట్నంలో 600, విజయవాడలో 400 ఆర్‌టిసి బస్సులు మాత్రమే ఉన్నాయి. ఇటీవల ప్రవేశ పెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఉన్న బస్సుల్లో మరింత రద్దీ పెరిగిపోతున్నది. రెండు నగరాల మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,051 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…ఈ రెండు నగరాలకు కనీసం 2వేల కోట్లు కేటాయించి నట్లయితే విశాఖకు మరో 900, విజయవాడకి 450 ఎలక్ట్రిక్ బస్సులు అదనంగా సమకూరేవి. ప్రజా రవాణా సదుపాయం మూడు రెట్లు అదనంగా పెరిగేది. దీనివల్ల ప్రైవేట్ రవాణాతో పాటు కాలుష్యం కూడా తగ్గేది.
దేశంలోను, రాష్ట్రంలోనూ నగరాల్లో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. పట్టణ రోడ్ల అభివృద్ధికి చర్యలు లేవు. విశాఖపట్నం లాంటి చోట్ల నగర పరిధిలో 80 కిలోమీటర్ల పొడువునా ఉన్న జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు లేవంటే నగర రోడ్ల దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాదచారులకు అవసరమైన ఫుట్‌పాత్‌లు లేవు. ఉన్నా అవి రకరకాల కార్యకలాపాలతో నిండిపోయి ఉంటాయి. దీంతో నగరాల్లో పాదచారులకు భద్రత కరువైంది. సైక్లింగ్‌కి అవసరమైన ప్రత్యేక లేన్లు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏనగరంలో కూడా మనకు కనిపించవు. పాలకులు నగరాల వికేంద్రీకరణ కన్నా నగర జనాభా కేంద్రీకరణ విధానాలనే అనుసరించడంతో రవాణా సమస్య నానాటికి పెరుగుతున్నది.
ప్రజా రవాణా అనేది అత్యధిక ప్రజలు ఆధారపడే ప్రజా సేవా రంగం. నగర ఆర్థిక, ప్రజల సామాజిక జీవితంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. నయా ఉదారవాద విధానాలను అవలంభించడం మొదలెట్టాక ప్రజా రవాణా వ్యవస్థను పెద్దఎత్తున ప్రైవేటీకరిస్తున్నారు. ప్రైవేట్ పెట్టుబడిని చొప్పిస్తున్నారు. కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ పట్టణ ప్రజా రవాణ మెరుగుదల చేసే నిధుల్లో 47 శాతం మెట్రో రైలు నిర్మాణాలకే కేటాయిస్తున్నారు. ప్రజల కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన ప్రజా రవాణా, మౌలిక సదుపాయాలను కార్పొరేట్ శక్తుల లాభాల కేంద్రంగా అతి కొద్ది మందికి ఉపయోగపడే ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. ప్రజా వనరులను కొల్లగొడుతూ సొంత ఆస్తులుగా మార్చుకుంటున్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పోకడలు తీవ్రమయ్యాయి. ఈ చర్యలు రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా రవాణా అభివృద్ధిని మరింత దెబ్బ తీయబోతున్నాయి.
డా|| బి.గంగారావు
వ్యాసకర్త సెల్ : 94900 98792
Follow us on
Website
Facebook
Instagram
YouTube