ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మోసం.. మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణ
ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు
కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు
ఘట్‌కేసర్, హైదరాబాద్ | ఎన్ టుడే న్యూస్:
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.4.5 లక్షలు తీసుకుని, ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. మల్లాపూర్‌లోని బ్రహ్మపుత్ర కాలనీకి చెందిన 30 ఏళ్ల మహిళ టైలరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. నాలుగు నెలల క్రితం భువనగిరికి చెందిన జగన్మోహన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. తాను మున్సిపల్ కార్యాలయంలో శానిటరీ మేనేజర్‌గా పనిచేస్తున్నానని, తన కార్యాలయంలోనే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని అతడు నమ్మించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఉద్యోగం ఇప్పించేందుకు ఉన్నతాధికారికి రూ.5 లక్షలు ఇవ్వాలని జగన్మోహన్ చెప్పడంతో, ఉద్యోగం వస్తుందనే ఆశతో బాధితురాలు రూ.4.5 లక్షలు అతడికి ఇచ్చినట్లు సమాచారం.
సోమవారం కారులో వచ్చిన జగన్మోహన్.. మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్తానని చెప్పి బాధితురాలిని శ్రీనిధి రిసార్ట్‌కు తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్గమధ్యలో ఆమె వద్ద ఉన్న రూ.4.5 లక్షలు తీసుకున్నాడని, రిసార్ట్‌లో ఉన్నతాధికారి ఉన్నాడని చెప్పి ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది.
అనంతరం ఆమెను కారులో ఎక్కించుకుని హైవేపైకి తీసుకెళ్లి కిందకు తోసేసి అక్కడి నుంచి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి జగన్మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.