www.ntodaynews.com
కార్మిక హక్కుల పరిరక్షణ యాత్ర
తెలంగాణ
గోలేటి నుంచి సత్తుపల్లి వరకు కార్మిక హక్కుల పరిరక్షణ యాత్ర: టీబీజీకేఎస్ కోర్ కమిటీ నిర్ణయం
సింగరేణి కార్మిక సమస్యలపై త్వరలో కేటీఆర్‌తో ప్రత్యేక సమావేశం – కొప్పుల ఈశ్వర్ NTODAY NEWS: గోదావరిఖని గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో గురువారం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంక్షేమం, సింగరేణి భవిష్యత్తు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కోర్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. తెలంగాణకు గుండెకాయలాంటి సింగరేణి పరిశ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మారుస్తోందని విమర్శిస్తూ, కార్మికులు, కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కార్మిక వాడలు, గనుల ప్రాంతాల్లో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పార్టీకి అనుబంధంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ దిశగా సింగరేణి ప్రాంతాల్లోని ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, కోర్ కమిటీలతో సమన్వయం చేసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
సింగరేణి సంస్థ రక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మరింత పెద్దఎత్తున పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు ప్రజాక్షేత్రంలోనే కాకుండా ఇతర రూపాల్లో కూడా ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల కోసం, సంస్థ అభివృద్ధి కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలను కార్మికుల్లోకి తీసుకెళ్లాలని కొప్పుల ఈశ్వర్ సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటమే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేసిందని, దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని తెలిపారు.
సింగరేణి గనుల ప్రైవేటీకరణ కోసం బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను కార్మికుల దృష్టికి తీసుకెళ్లాలని, ఈ అంశాలపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. బొగ్గు గని కార్మిక సంఘానికి పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు, సహకారం అందిస్తుందని, కార్మికులకు ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తుందని తెలిపారు.
రానున్న రోజుల్లో సింగరేణి పరిరక్షణ కోసం గోలేటి నుంచి సత్తుపల్లి వరకు కార్మిక యాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని, ఆదాయపు పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ మంత్రులను ఢిల్లీలో కలవాలని, అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
నవంబర్, జూలై నెలల్లో మెడికల్ బోర్డులో అనారోగ్యంతో ఉన్న కార్మికులకు తక్షణమే రీ-మెడికల్ నిర్వహించాలని, ప్రతి నెలా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మికుల వారసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలు రాబట్టేందుకు లీగల్ సెల్‌తో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
త్వరలో కేటీఆర్తో మాట్లాడి సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్మికునికైనా అన్యాయం చేస్తే చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు లీగల్ సెల్ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని చెప్పారు.
ఈ సమావేశంలో చీఫ్ జనరల్ సెక్రటరీ కాపుకృష్ణ, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, కోశాధికారి చెల్పూరి సతీష్, కేంద్ర ఉపాధ్యక్షులు సంపత్ కుమార్, మంగీలాల్ కూసన, వీరభద్రం ప్రభాకర్ రెడ్డి, సదానందం, 11 డివిజన్ల ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, నాగేల్లి సాంబయ్య, మల్రాజు శ్రీనివాసరావు, మేడిపల్లి సంపత్, బండి రమేష్, బడితల సమ్మయ్య, నాగేల్లి వెంకటేశ్వర్లు, గడప రాజయ్య, తుమ్మ శ్రీనివాసరావు, జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube