కుటుంబాల అంగీకారం లేక.. చెట్టుకు ఉరేసుకుని యువ జంట మృతి
ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సంభల్ జిల్లా సెంజని గ్రామానికి చెందిన 17 ఏళ్ల సుధ, 19 ఏళ్ల అనిల్ మృతదేహాలు గ్రామానికి సమీపంలోని పొలంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాయి.
స్థానికుల వివరాల ప్రకారం.. సుధ, అనిల్ ఒకే గ్రామానికి చెందినవారు. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. తమ వివాహానికి కుటుంబాలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ మనస్తాపానికి గురైనట్లు సమాచారం.
ఈ క్రమంలో గ్రామానికి సుమారు కిలోమీటర్ దూరంలోని పొలంలో ఇద్దరూ ఉరేసుకుని మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉదయం పొలాల వైపు వెళ్లిన స్థానికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.