అన్ని స్థానాల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం ఖాయం: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఎన్నికల బరిలో అభ్యర్థులు: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు (ఎన్ టుడే న్యూస్):
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పుంగనూరు మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలను కలుసుకుని ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా పోరాటం చేస్తున్నాయని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు సృష్టించినా వెనకడుగు వేయకుండా పార్టీ అభ్యర్థులు ధైర్యంగా ఎన్నికల బరిలో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పోరాటం చేయలేక చేతులెత్తేశారని విమర్శించారు. అయితే వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు గెలుపోటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు.
పుంగనూరు మండలంలోని స్థానిక సంస్థల స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానంలోనూ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో శ్రీనాథ్ రెడ్డి, అనిషారెడ్డి, వైఎస్ఆర్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఏ. వెంకటరమణ, ఎంపీటీసీ అభ్యర్థి రమాదేవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.