చైనీస్ మాంజాపై ఉక్కుపాదం

Spread the love

చైనీస్ మాంజాపై ఉక్కుపాదం

విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్ కేసులు
-హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్

NTODAY NEWS: హైదరాబాద్ 

సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలు, వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. పక్షుల స్వేచ్ఛకు, అమాయక వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ ప్రమాదకరమైన మాంజాను ఎవరైనా రహస్యంగా విక్రయించినా, నిల్వ ఉంచినా ఉపేక్షించబోమని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైనీస్ మాంజా నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యల విషయంలో క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సీపీ తెలిపారు. పండుగ పూట గాలిపటాలు ఎగురవేయడం సంప్రదాయమే అయినప్పటికీ, అది ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదని సూచించారు. చైనీస్ మాంజా పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తుందని, ఇది మట్టిలో కలిసిపోకుండా ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ చట్టం–1986 ప్రకారం చైనీస్ మాంజా తయారీ, విక్రయం, నిల్వ, వినియోగంపై ప్రభుత్వం పూర్తిస్థాయి నిషేధం విధించిందని గుర్తుచేశారు. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు నగరవ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నగరంలోని అన్ని జోన్లలో కైట్స్ విక్రయ కేంద్రాలు, చిన్న కిరాణా దుకాణాలు, అనుమానిత గోదాములపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. కేవలం విక్రయదారులే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి అక్రమంగా ఈ నిషేధిత మాంజాను రవాణా చేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలు, పార్శిల్ సర్వీసులపైనా నిఘా పెంచామని, వారి ప్రమేయం తేలితే ఏజెన్సీ యజమానులపైనా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. చైనీస్ మాంజాలో ప్లాస్టిక్, ఇతర సింథటిక్ పదార్థాలు, గాజు పెంకుల మిశ్రమం పూతగా ఉండటం వల్ల ద్విచక్ర వాహనదారుల మెడలు తెగిపోవడం, పిల్లల వేళ్లు కోసుకుపోవడం వంటి ప్రమాదాలు జరుగుతాయని వివరించారు. అంతేకాకుండా, మెటాలిక్ పదార్థాల కారణంగా విద్యుత్ తీగలకు తగిలితే షాక్ కొట్టి ప్రాణాపాయం సంభవించే అవకాశముందని హెచ్చరించారు. తల్లిదండ్రులు సంప్రదాయ నూలు దారాలనే ఉపయోగించేందుకు పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. నగర పౌరులు కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సీపీ పిలుపునిచ్చారు. తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నిషేధిత చైనీస్ మాంజాను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు లేదా నిల్వ చేసినట్లు గమనిస్తే వెంటనే డయల్ 100, లేదా హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నెంబర్: +91 94906 16555, లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »